ఏపీ రాజ‌ధాని..ఓ రాజ‌స్థాన్..స్పీక‌ర్ త‌మ్మినేని తీవ్ర వ్యాఖ్య‌లు

Update: 2019-12-22 13:14 GMT
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఇప్ప‌టికే న‌లుదిక్కులా అనేక విమ‌ర్శ‌లు - వివాదాలు ర‌గుతున్న స‌మ‌యంలో మండుతున్న భోగి మంట‌లో మ‌రింత ఆజ్యం పోసిన‌ట్టు.. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ మ‌రింత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే అమ‌రా వ‌తిని వ‌ద్ద‌ని వైసీపీ నాయ‌కులు దీనిని వ‌ద్దంటూ ఓ తీర్మానం చేశారు. మూడు రాజ‌దానుల ముచ్చ‌ట‌ను తెర‌మీదికి తెచ్చారు. సీఎం జ‌గ‌న్ సాక్షాత్తూ దీనిని అసెంబ్లీలో వెల్ల‌డించారు. ఈలోగానే జీఎన్ రావు క‌మిటీ కూడా నివేదిక ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో ఇక‌, ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లిస్తార‌ని - మూడు ప్రాంతాల్లోమూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీంతో రాజ‌ధాని అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు - రైతులు ఉద్య‌మానికి సిద్ధ‌మై.. రోడ్డెక్కారు. ఇప్ప‌టికే మీడియా కూడా అమ‌రా వ‌తికి మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ వివాదం ఇలా సాగుతుంటే .. అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్‌.. దీనికి మ‌రింత మంట పుట్టించే వ్యాఖ్య‌లు చేశారు. ``అస‌లు అక్క‌డ ఏముంది?  కారులో వెళ్తుంటే.. ఏదో ఎడారిలో ప్ర‌యాణిస్తున్న‌ట్టుగా అనిపిస్తోంది.

చాలా మంది ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌ద‌ని ఈ విష‌యం చెప్పేందుకు వెనుకాడుతున్నారు. అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి. ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి. అమరావతిలో ఆ పరిస్థితి కనిపించలేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు`` అని సీతారామ్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఢిల్లీ పర్య‌ట‌న‌లో ఉన్న సీతారామ్‌.. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు - రైతుల ఉద్య‌మంపై ప‌రోక్షంగా స్పందించారు. అవ‌న్నీ పెయిడ్ ఉద్య‌మాలేన‌ని త‌నకు తెలిసిన వారు చెబుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాజ‌స్థాన్ ఎడారిలా ఉన్న అమ‌రావ‌తిని ఎప్ప‌టికి అభివృద్ధి చేయాలో మీరే చెప్పండి? అంటూ ఆయ‌న పాత్రికేయుల‌కే ఎదురు ప్ర‌శ్న వేశారు. జ‌గ‌న్ ఏం చేసినా.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేస్తార‌ని, అఖండ‌మైన మెజారిటీ ఇచ్చిన ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూసుకోవ‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేర‌ని త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా త‌మ్మినేని చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో అసెంబ్లీలో విప‌రీత వ్యాఖ్య‌లు - చ‌ర్చ‌ల‌కు త్వ‌ర‌లోనే ఫుల్ స్టాప్ ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

   

Tags:    

Similar News