టీడీపీకీ తమ్మినేని స్ట్రాంగ్ వార్నింగిచ్చేశారే!

Update: 2020-01-19 16:50 GMT
సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని రైతులతో అసెంబ్లీని ముట్టడిస్తామని తెలుగు దేశం పార్టీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ముట్టడిలో భాగంగా శాసనసభకు హాజరయ్యే సభ్యులు సభకు రాకుండా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదని శాసనసభాపతి హోదాలో తమ్మినేని సీతారాం ఓ రేంజిలో హెచ్చరికలు జారీ చేశారు. శాసన సభా సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన తమ్మినేని... సభా హక్కులు, సభ్యుల హక్కులు, వాటిని కాలరాసే దిశగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్న కోణంలో తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ దిశగా తమ్మినేని ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘చట్టసభలకు సభ్యులు హాజరు కాకుండా నిరోధించడమంటే సభా హక్కులను హరించడమే. శాసన సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుంది. చట్టానికి లోబడే ఎవరైనా నిరసనలు చేయొచ్చు. సభ్యులు తమ సమస్యలను సభలో చెప్పుకోవచ్చు. అందుకు విరుద్ధంగా దాడులు చేస్తాం. ముట్టడిస్తామనేది సరైన పద్దతి కాదు. సభకు వచ్చే సభ్యులను అడ్డుకోవడం నేరమే. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు స్పీకర్ కు ఉంది. సభ్యుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని రాజ్యాంగం కల్పించింది. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని తమ్మినేని తనదైన శైలిలో చెప్పుకుపోయారు.

సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై ప్రభుత్వం ప్రతిపాదన పెట్టడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ తీర్మానం కూడా పొందనుందన్న వార్తల నేపథ్యంలో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సభకు హాజరుకాకుండా సభ్యులను ఎక్కడిక్కడ అడ్డుకునే దిశగానూ రైతులు సిద్ధమవుతున్నారు. ఓ విపక్ష నేతగా ఉంటూ కీలకమైన అసెంబ్లీ సమావేశాల వేళ అసెంబ్లీ ముట్టడి అంటూ పిలుపు ఇవ్వడమేమిటన్న వాదనల నేపథ్యంలో అదే తరహాలో తమ్మినేని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తంగా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ఏ తరహా ఉద్రిక్తతలకు దారి తీస్తాయో చూడాలి.



Tags:    

Similar News