వైసీపీ మేలు చేసే బీజేపీ ఎత్తుగ‌డ‌

Update: 2016-09-25 09:30 GMT
అధికార తెలుగుదేశంపార్టీ - ఆ పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీల మ‌ధ్య కొత్త సందేహాల దొంత‌ర‌లు మొద‌ల‌య్యాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న 11 మున్సిపాలిటీలు - కార్పొరేషన్ల ఎన్నిక‌ల రూపంలో ఇది ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే క్ర‌మంలో త‌మ ఎదుగుద‌ల కోసం అంటూ బీజేపీ కొత్త ప్ర‌తిపాద‌న మొద‌లుపెట్టగా ఇది వైసీపీ మేలు చేసేందుకు స‌హ‌క‌రిస్తుంద‌ని టీడీపీ స‌సేమిరా అంటోంది. వెర‌సీ ప్ర‌త్యేక హోదా గ్యాప్ కొలిక్కి రాక‌ముందే తాజా పేచీ ప్రారంభ‌మైంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

అధికార తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఇటీవ‌ల విజయవాడలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి వచ్చే నవంబర్ మాసంలో జరగాల్సిన ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. గుంటూరు - కాకినాడ - కర్నూలు - విశాఖపట్నం - తిరుపతి - ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం - నెల్లిమర్ల - రాజాం - రాజంపేట - కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం రెడీ అయింది. దీంతో రాజకీయ పార్టీల్లో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. అధికార తెలుగుదేశం - ప్రధాన ప్రతిపక్షమైన‌ వైసీపీల మధ్యే ప్ర‌ధాన‌ పోటీ ఉంటుందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు. అయితే, టీడీపీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ పాత్ర మ‌ధ్య పోటీ పేచీ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు - మున్సిపాలిటీల్లో పోటీపై ఆశక్తి చూపుతున్న ఆశావహుల జాబితాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. కార్పొరేషన్లు - మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా వివరాలు పక్కాగా ఉండేట్లు చూసుకోవాలని సూచించారు. జాబితాలో నుండి తొలగించాల్సిన వారి పేర్లు - ఓటర్లుగా చేర్పించాల్సిన వారి పేర్లు సక్రమంగా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పారు.

టీడీపీ-బీజేపీలో కలిసే పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల పోరులో తమకు విశాఖపట్నం - తిరుపతి కార్పొరేషన్లతో పాటు గుంటూరు - కాకినాడ కార్పొరేషన్లలో ఏదో ఒక మేయర్ పీఠాన్నిఇవ్వాలని టీడీపీని కోరేందుకు బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే సిద్ధ‌మ‌య్యారు. ఈ  మేర‌కు పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య చర్చలు పూర్త‌యిన‌ట్లు సమాచారం. అయితే మొత్తం 11 చోట్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు గెలవటమన్నది చంద్రబాబు ప్రభుత్వానికి త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రం. ఈ సమయంలో భాజపాకు రెండు లేదా మూడు కార్పొరేషన్లను వదిలి పెట్టటమంటే వైసీపీకి అప్పనంగా వదిలిపెట్టటమనే వ్యాఖ్యలు టీడీపీ నేతల మధ్య వినబడుతున్నాయి. ఈ ర‌కంగా వైసీపీకి మేలు చేసేందుకు తమ మిత్ర‌ప‌క్షం ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News