మోహరించిన విపక్షం...వైసీపీకి ఏది గత్యంతరం....?

Update: 2023-01-20 01:30 GMT
ఒక వైపు చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన పండుగ పూట కూడా రాజకీయమే అన్నట్లుగా మారిపోయారు. ఎందుకంటే 2024 ఎన్నికలు తెలుగుదేశానికి ఎంతటి కీలకమో ఆయనకు బాగా తెలుసు. ఇక కొడుకు లోకేష్ ని పాదయాత్రకు రెడీ చేసి పెడుతున్నారు. అలా ఏకంగా నాలుగు వందల రోజుల పాటు తెలుగుదేశం నామస్మరణం తో ఏపీ మారుమోగుతుంది.

మరో వైపు చంద్రబాబు కూడా జిల్లా టూర్లను కొనసాగిస్తారు. ఆయన ఎన్నికలు వచ్చేలోగా మొత్తం 175 నియోజకవర్గాలను కవర్ చేయాలని చూస్తున్నారు. అలా తెలుగుదేశం ప్రజలకు చేరువ అయ్యేందుకు తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకుంది. ఇంకో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ వాహనాన్ని రోడ్డు మీదకు తెస్తున్నారు.

ఆయన కూడా ఏపీ అంతా టూర్లు వేస్తారు. జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఘాటుగానే చేస్తారు. ఎటూ వాహనం చేతిలో ఉంది కాబట్టి ప్రతి పల్లెలో గల్లీలో ఆపుకుంటూ పోతారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అలా చెప్పుకుంటూ పోతారు. కాలినడకన లోకేష్ విమర్శలు చేస్తే వాహన మార్గంలో పవన్ కళ్యాణ్ యాంటీ వైసీపీ నినాదాలను వేడెక్కిస్తారు. చంద్రబాబు ఎటూ జిల్లాల టూర్లతో హల్ చల్ చేస్తారు..

ఇలా ముప్పేట దాడికి విపక్షం రంగం సిద్ధం చేస్తున్న వేళ వైసీపీ నుంచి జవాబు ఉండాలి కదా. కనీసం ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ని బ్యాలన్స్ చేయాలి కదా. విపక్షాలు అన్నీ నిజాలు చెప్పవనే వైసీపీ అనుకోవచ్చు. వారు అసత్యాలు ప్రచారం చేస్తారు అని ధీమా పడవచ్చు. కానీ పదే పదే జనంలో వారు చెబుతున్నదే చెబుతూ జనంలో ఉంటే డ్యామేజ్ జరిగేది ఎవరికి అన్నది వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోందా అన్నదే చర్చగా ఉంది.

జగన్ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన నోటిఫికేషన్ వచ్చేవరకూ పాలన సాగించాల్సిందే. ఆయన ఎన్నికల సభలు పెట్టుకుంటూ తిరిగాలంటే కుదరదు. మరి వైసీపీలో స్టార్ కాంపెయినర్స్ ఎవరు ఉన్నారు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. విపక్షంలో ఉన్నపుడు జగన్ వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసినా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ తోడుగా నిలిచి అనేక సభలలో తిరిగి హోరెత్తించబట్టే ఫలితం దక్కింది.

ఇపుడు జగన్ అధికార బాధ్యతలతో తిరగక, వైసీపీ నుంచి స్టార్ కాంపెనియర్లు లేకపోతే వచ్చే ఎన్నికల ఫలితాల సంగతి పక్కన పెడితే రేపటి నుంచి విపక్ష యాత్రల దూకుడుకి సరైన రివర్స్ అటాక్ మాత్రం లేకుండా పోతుంది అన్నదైతే పార్టీలో చర్చగా ఉంది మరి. అయితే జగన్ కూడా జిల్లాల టూర్లు మధ్యలో చేస్తూ జనాలతో కనెక్ట్ కావాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

కానీ అధికార దర్పాల మధ్య పరదాల మాటున పెట్టే సభల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా విపక్షాలు బస్తీమే సవాల్ అంటూంటే ఒకటో అరో మీటింగ్స్ తో మమ అనిపించాలనుకున్నా రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉంది. మొత్తానికి చూస్తే ప్రతిపక్షం ముప్పేట దాడిని ఎదుర్కొనే ఆయుధం అయితే ఈ రోజుకి వైసీపీ వద్ద లేదనే అంటున్నారు. మరి దీనికి వైసీపీ ఏమి చేయబోతుంది అన్నదే ప్రశ్నగా ఉంది. మా వైపు జనాలు ఉన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా మాకే ఓటు అని నిమ్మళంగా కూర్చుంటే మాత్రం రాజకీయ ముప్పుని కోరి తెచ్చుకున్నట్లే అన్నది కరెక్ట్ విశ్లేషణగా ఉంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News