టీడీపీ అభిమానుల‌కు చేదువార్త‌​

Update: 2016-04-18 04:19 GMT
నిత్యం నాయకులు, కార్యకర్తలు రాకతో సంద‌డిగా ఉంటే హైద‌రాబాద్‌ లోని ఎన్టీఆర్ భ‌వ‌న్ మ‌రికొద్ది రోజుల్లో బోసిపోనుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక హడావుడితో సంద‌డిగా ఉండే కార్యాల‌యం మ‌రి కొద్ది రోజుల్లో మూత‌ప‌డ‌నుంది! ఒకప్పుడు ఎన్నో సంచలనాలకు కేంద్రం అయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈ నెల 22 నుంచి కేవలం నామమాత్రంగా మారిపోనుంది.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ కు ఇప్ప‌టికే పెద్ద‌గా నేత‌లెవ‌రూ రావటం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కార్యక్రమాల అమలు కమిటీలో ఓ పది మందికిపైగా..సమాచార విభాగంలో 25 మంది - లైబ్రరీ విభాగంలో మరో 20 మందికిపైగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌స‌రాల రీత్యా ఏర్పాటుచేస్తున్న ఆఫీసుకోసం హైద‌రాబాద్‌ లో ఉన్న సిబ్బంది ఈ నెల 20వ తేదీ నుంచి గుంటూరుకు తరలి వెళుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసే వారి వేతనాలు తక్కువగానే ఉన్నాయి. కాకపోతే నివాస వసతి - భోజన సదుపాయం పార్టీ ఆఫీసే సమకూర్చేది. దీంతో వారికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. గుంటూరుకు తరలివెళ్ళి అక్కడ కొత్తగా బయట ఇళ్లు చూసుకోవటంతో పాటు.. అన్ని వసతులు సమకూర్చుకోవడం ఈ జీతాలతో కష్టం అనే భావన కొంత మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడి వెళితే జీతాల పెంపు విషయంలో పార్టీ ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వలేదని సమాచారం. మొత్తంగా పార్టీ మార్పు అంశం తెలుగుదేశం అభిమానుల‌కు చేదువార్తేన‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News