టీడీపీ ప్లస్ జనసేన : అంతొద్దు.. అది చాలు....?

Update: 2022-05-08 08:42 GMT
ఏపీలో కొత్త పొత్తులకు తెరలేచినట్లే. దాదాపుగా దీనికి సంబంధించిన సంకేతాలు అటూ ఇటూ వచ్చేశాయి. ఇక మంచి ముహూర్తం చూసుకుని పొత్తుల మీద చర్చల‌కు కూర్చోవడమే తరువాయి అన్నట్లుగానే వాతావరణం ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఈ రెండు పార్టీల ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.

ఇక రాజకీయ, సామాజిక‌, ప్రాంతీయ పరిస్థితులు అన్నీ కూడా ఈ పొత్తులకు అనుకూలంగా ఉండడంతో రెండు వైపుల నుంచి సై అంటే సై అన్న మాట ఉంది. మరి పొత్తులు అంటే గొడవ అంతా సీట్ల పంపిణీ దగ్గర వస్తుంది. రేపటి ఎన్నికల్లో మా పవనే సీఎం అని జనసైనికులు ఈ రోజు జబ్బలు చరుస్తున్నారు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్న తీరున జనసేనలో హుషార్ కనిపిస్తోంది. ఈ పరిణామాలను చూస్తే కనుక జనసేనతో పొత్తు కుదరాలీ అంటే సీట్ల సర్దుబాటు కచ్చితంగా ఉభయతారకంగా ఉండాలి.

ఏదో కొన్ని సీట్లు ఇచ్చేశామనుకుని టీడీపీ త్యాగం చేయమంటే అసలు కుదిరే వ్యవహారం మాత్రం కానే కాదు. దీని మీద జనసేనలో ఉన్న వాదన ఏంటి అంటే తమకు 2019 నాటి కంటే బాగా పట్టు పెరిగిందని, ఓట్ల శాతం కూడా గతంలో కంటే బాగా పెరిగింది అని. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చింది కూడా ఇదే.

ఆయన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ ఏపీలో జనసేనకు 27 శాతం ఓట్ల శాతం ఉంది అన్నారు. ఇక వచ్చే రెండేళల్లో అది ఇంకా పెరుగుతుంది అన్న భావన కూడా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరు జిల్లాలలో జనసేన బలం బాగా ఉందని అంచనా కడుతున్నారు.

దాంతో ఈసారి కచ్చితంగా జనసేనకు 75 సీట్లు పొత్తులో భాగంగా ఇవ్వాలన్నది ఒక వాదనగా వినిపిస్తోంది. అంటే ఏపీలో మొత్తం సీట్లు 175 ఉంటే అందులో వంద దాకా టీడీపీ పోటీ చేసినా 75 సీట్లు మాత్రం కచ్చితంగా  జనసేన‌కు ఇవ్వాలని కోరుతారు అని అంటున్నారు. ఈ లెక్క ఎందుకు అంటే రేపటి రోజున పొత్తులతో వెళ్తే  ఈ 75 సీట్లలో కచ్చితంగా 60 సీట్ల దాకా జనసేన గెలిచి తీరుతుంది అని కూడా భావిస్తున్నారు.

అంటే ఎన్నికల అనంతరం ఏర్పడే టీడీపీ జనసేన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నా, పవర్ షేరింగ్ కోసం డిమాండ్ చేయాలన్నా కూడా ఈ అరవై సీట్లు చాలా కీలకం అని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారుట. అందుకే 75 మార్క్ దగ్గర వారు టిక్ పెట్టినట్లుగా చెబుతున్నారు. అందువల్ల తమకు సగం సగం సీట్లు వద్దు, 75 సీట్లు దాకా ఇస్తే చాలు అన్నదే జనసేనలో వినిపిస్తున్న మాట.

అదే విధంగా రేపటి రోజున అధికారంలోకి వస్తే కచ్చితంగా పవర్ షేరింగ్ కి పట్టుబడతామని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈసారి పొత్తు బేరాలు మాత్రం గట్టిగానే సాగుతాయని అంటున్నారు. ఇక తెలుగుదేశం కూడా దీనికి అంగీకరించే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఈ పొత్తులు జనసేన కంటే కూడా టీడీపీకే చాలా ముఖ్యం.

ఈసారి ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి. అందుకే అదను చూసి మరీ జనసేన సీట్ల దగ్గర గట్టిగా పట్టుబట్టడమే కాకుండా సాధించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీ చరిత్రలో ఫస్ట్ టైమ్ మరో పార్టీకి సింహ భాగం సీట్లు ఇవ్వడం అన్న దాన్ని ఒక రికార్డుగానే చూడాలని అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News