జే బ్రాండ్ మ‌ద్యం సొమ్మంతా తాడేప‌ల్లికే చేరుతోందా?

Update: 2022-06-28 13:38 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జే బ్రాండ్ మ‌ద్యం సొమ్మంతా తాడేప‌ల్లికే చేరుతోందా అంటే అవున‌నే అంటున్నారు.. టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా. వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక 106 మ‌ద్యం బ్రాండ్లు ఏపీలో వ‌చ్చాయని ఆయ‌న తాజాగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జే బ్రాండ్ మీద వ‌చ్చిన మ‌ద్యం సొమ్మంతా తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ నివాసానికే చేరుతోంద‌ని బొండా ఉమ విమ‌ర్శిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న మ‌ద్యంలో హానిక‌ర ప‌దార్ధాలు ఉంటున్నాయ‌ని ఇవి తాగి ఎంతోమంది చ‌నిపోతున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉలుకుప‌లుకు లేద‌ని బొండా ఉమ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ సర్కార్ కు దమ్ముంటే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌వేశ‌పెట్టిన 106 మద్యం బ్రాండ్లకు ప‌రీక్ష‌లు చేయించాల‌ని స‌వాల్ విసురుతున్నారు. ఈ మ‌ద్యం అమ్మకాలు పార‌ద‌ర్శ‌కంగా లేవ‌ని అంటున్నారు. దేశ‌మంతా డిజిట‌ల్ చెల్లింపులు ఉన్నాయ‌ని.. మారుమూల గ్రామాల్లో ఉన్న దుకాణాల్లో సైతం డిజిట‌ల్ చెల్లింపులు జ‌రుగుతున్నాయ‌ని బొండా ఉమా గుర్తు చేస్తున్నారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యానికి మాత్రం న‌గ‌దు వ‌సూలు చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌ద్యం దుకాణాల్లో ఎక్క‌డా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివాటిని వినియోగించ‌నీయ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.

మ‌ద్యం దుకాణాల్లో వినియోగ‌దారుల నుంచి వ‌సూలు చేస్తున్న‌ ఆ డబ్బంతా తప్పుడు లెక్కల రూపంలో సీఎం జ‌గ‌న్ నివాసానికి చేరుతోంద‌ని బొండా ఉమా ధ్వ‌జ‌మెత్తుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాండ్లు మంచివేన‌ని మంత్రి అంబ‌టి రాంబాబు చెబుతున్నార‌ని.. వీట‌న్నింటిని ఆయ‌న ఎప్పుడు సేవించార‌ని బొండా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం బ్రాండ్లకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీ నేతల చేతుల్లోనే మ‌ద్యం డిస్టిల‌రీలు ఉన్నాయ‌ని బొండా ఉమ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వీటిలో న‌కిలీ మ‌ద్యం త‌యారు చేసి సొమ్ము చేసుకుంటున్నార‌ని నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ఆధారాలతో నిరూపించినప్పటికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని బొండా ఉమా అంటున్నారు.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం అమ్ముతున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, త‌దిత‌ర డిజిట‌ల్ సేవ‌ల ద్వారా న‌గ‌దు తీసుకుంటే మ‌ద్యం అమ్మ‌కాలు పార‌ద‌ర్శ‌కంగా ఉంటాయ‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన కూడా ప్ర‌తిప‌క్షాల నుంచి, మీడియా నుంచి ఆరోప‌ణ‌లు ఉండ‌వ‌ని అంటున్నారు. మ‌రోవైపు మందు బాబులు కూడా డిజిట‌ల్ చెల్లింపులు లేక‌పోవ‌డంతో న‌గ‌దు రూపంలో ఇవ్వ‌డానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు డిజిట‌ల్ చెల్లింపులు లేక‌పోవ‌డం.. న‌గ‌దు ఇస్తేనే మందు అమ్ముతుండ‌టం స‌రికాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News