వైసీపీ... బొక్క‌లో పార్టీ.. టీడీపీ నేత హాట్ కామెంట్స్‌

Update: 2022-05-29 14:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. బొక్క‌లో పార్టీ అని.. టీడీపీ సీనియ‌ర్ నేత , మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహానాడుకు మహాదరణ వచ్చిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. 2054 వరకు నారా కుటుంబం అధికారంలో ఉంటుందని, 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా మునిగిపోవడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. వైసీపీని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలని బుద్దా వెంకన్న సూచించారు. జగన్, విజయసాయిరెడ్డి బొక్కలో ఉన్నప్పుడు వైసీపీని మూసే యాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

జగన్ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పార్టీని నిలబెట్టారని, అధికారంలోకి వచ్చాక అదే తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచారని వెంకన్న విమర్శించారు. మంత్రుల బస్సుయాత్రతో ప్రజలకేం ఉపయోగమని, జగన్, వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును చంద్రబాబు కక్కిస్తారని బుద్దా వెంకన్న తెలిపారు.

వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం, వారి అభద్రతాభావాన్ని బయటపెడుతోందని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. టీడీపీ నేత‌ల‌పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మహానాడుకు వైసీపీ ప్రభుత్వం  అడ్డంకులు పెట్టిందని  అన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ జరిగిందన్నారు. గన్నవరంలో ఎన్టీఆర్   విగ్రహం కనబడకుండా ఫ్లెక్సీ కట్టిన వంశీ చరిత్రహీనుడని దుయ్యబట్టారు. సామాజిక న్యాయానికి సమాధి కట్టి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని మాట్లాడిన తెలంగాణ వ్యక్తి ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారని, ఇది సామాజిక న్యాయం అంటే తాము నమ్మాలా? అని బుద్దా వెంక‌న్న నిలదీశారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా దాడులు, కేసులతో టీడీపీ కార్యకర్తలకు ఊపిరాడలేదన్నారు. ఆర్ధికంగా, భౌతికంగా అష్టదిగ్బంధనం చేయడంతో విలవిల్లాడారని అన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా.. కరోనా పేరుతో అధికార యంత్రాంగం అడ్డుకోవడం, కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఆ కష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాక తప్పదని పేర్కొన్నారు.  మహానాడు రూపంలో తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష బయటపడింద‌న్నారు.

"మహానాడు బహిరంగ సభకు జనం ఉప్పొంగడం చూశాక.. మూడేళ్లుగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్ధత మటుమయాం అయినట్లు తెలిసిపోతోంది. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, కసి ఉరకలేస్తున్నాయి. ఏపీ నలుమూలల నుంచే కాకుండా.. తెలంగాణ నుంచి కూడా జనం భారీగా స్వచ్చంధంగా తరలి రావడం.. ముఖ్యంగా మహిళలు, యువత కదంతొక్కడం.. పార్టీ అధినేత చంద్రబాబు, నేతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది" అని బుద్దా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News