లోకేష్‌ పాదయాత్ర.. దీన్నెవరూ అసలు ఊహించి ఉండరుగా!

Update: 2023-05-14 12:08 GMT
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర నారా లోకేష్‌ పాదయాత్ర సాగనుంది.

ప్రస్తుతం లోకేష్‌ పాదయాత్ర కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నల్లకాలువ సమీపంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతి వనం వద్ద ఆయన విగ్రహానికి నారా లోకేష్‌ నమస్కరించారు.

2009లో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్దే చోటు చేసుకుంది. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన గుర్తుగా అక్కడ వైఎస్సార్‌ స్మృతివనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ నల్లకాలువ వద్దకు చేరుకోగానే వైఎస్సార్‌ స్మృతివనం వద్ద ఆయనకు నమస్కరించారు.

కాగా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి... భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమీషన్ల స్వీకరణకు పాల్పడ్డుతున్నారని లోకేష్‌ మండిపడ్డారు. చివరికి దేవుడిని కూడా వదల్లేదు అంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే శిల్పా అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలనే కాదు చివరికి దేవుడిని కూడా దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

2019 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించారని.. మరి, శ్రీశైలం ఏమైనా అభివృద్ధి చెందిందా అని లోకేష్‌ ప్రశ్నించారు. ఎవరి జీవితాలై మారాయా? అని ప్రజలను అడిగారు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు ఇలా అంతా కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారుని లోకేష్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పేరుని మార్చానని లోకేష్‌ తెలిపారు. శిల్పా చక్రపాణి కాదు చీటింగ్‌ చక్రపాణి అని మండిపడ్డారు. రూ.5లక్షల పనికి కూడా 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని ఆరోపించారు.  అంటే చీటింగ్‌ చక్రపాణికి ఎంత డబ్బు పిచ్చి ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.

శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని లోకేష్‌ ధ్వజమెత్తారు. శ్రీశైలం దేవస్థానంలో తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో ఎమ్మెల్యే శిల్పా భారీ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

హౌస్‌ కీపింగ్, సెక్యూరిటీ గార్డుల నియమాక టెండర్లు ఎమ్మెల్యే బంధువు రాజశేఖరరెడ్డికి కట్టబెట్టారని ఆరోపించారు. వ్యాపారుల దగ్గర నుండి అక్రమ వసూళ్లు, అక్రమంగా షాపుల ఏర్పాటు, లడ్డూ తయారీలో అక్రమాలకు పాల్పడి దేవుడి సొమ్ము కాజేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం టికెట్ల దగ్గర నుండి ప్రసాదం వరకూ వైసిపి నేతల దోపిడీ జరుగుతోందని లోకేష్‌ ఆరోపించారు.

Similar News