టీడీపీలో నేతల మిస్సింగ్.. అజ్ఞాతవాసం

Update: 2019-09-11 04:51 GMT
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - చింతమనేని ప్రభాకర్ - కూన రవికుమార్.. యరపతినేని శ్రీనివాసరావు.. ఇలా టీడీపీలో వెలుగు వెలిగిన ఈ నలుగురు నేతలు ఇప్పుడు కనిపించడం లేదు.. అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో తెలియదు.. ఇంతకీ వీరు అజ్ఞాత వాసంలోకి వెళ్లడానికి కారణం ఏంటో తెలుసా? కేసుల భయం. అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం తీగలాగడంతో వీరంతా కేసులకు భయపడి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు వెలుగుచూశాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. ఇక టీడీపీ నేతల బాధితులు వైసీపీ ప్రభుత్వంపై భరోసాతో బయటకు వచ్చి కేసులు పెట్టారు.

చింతమనేని ప్రభాకర్.. పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే. టీడీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఎమ్మెల్యే. ఈయన దూకుడును ఎవరూ అడ్డుకోలేదు. వైసీపీ నేతలు - దళితులు - మైనార్టీలపై దాడులు చేసిన ఈయనపై టీడీపీ హయాంలో ఎలాంటి చర్యలు - కేసులు లేవు. దాదాపు 52 కేసులు పెండింగ్ లో ఉండడంతో వైసీపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. దీంతో ఆయన కేసులకు భయపడి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈయన కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఢిల్లీ లేదా గుర్గావ్ కు చింతమనేని తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వేరొకరి భూమిని తప్పుడు పత్రాలతో ఫోర్జరీ చేసిన కేసులో ఇరుకున్నారు. ఆయనకు నోటీసులు పంపగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఆయన సోమవారం పోలీసుల ముందు హాజరుకాలేదు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. టీడీపీలో వాయిస్ ను బాగా రేజ్ చేసి వైసీపీపై విరుచుకుపడే సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు బలమైన కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారులపైనే దాడి చేసిన ఆయనపై చార్జిషీట్ దాఖలైంది. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఈయన కోసం వెతుకుతున్నారు.

టీడీపీ నేత - గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా అక్రమ మైనింగ్ కేసు విషయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టీడీపీ హయాంలో పల్నాడు ప్రాంతంలో ఐదేళ్లలో ఎమ్మెల్యే యరపతినేని అక్రమ క్వారీయింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టు సూచన మేరకు వైసీపీ కేబినెట్ సీబీఐకి కేసు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో ఆయన కూడా అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన ఈ నలుగురు కూడా ఇప్పుడు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.
    

Tags:    

Similar News