బాబు ఇమేజ్ నాశ‌నం చేయ‌టానికి త‌మ్ముళ్లు చాలు!

Update: 2019-06-27 09:19 GMT
ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్న వేళ‌లో కొన్ని ప‌రిణామాలు చ‌క‌చ‌కా చోటు చేసుకుంటాయి. ప్ర‌జాతీర్పు ఎవ‌రికి అనుకూలంగా ఉండి.. అధికారంలోకి ఎవ‌రు వ‌స్తార‌న్న క్లారిటీ వ‌చ్చిన క్ష‌ణం నుంచే వారికి సంబంధించిన భ‌ద్ర‌త మొత్తం మారిపోతుంది. ఇది రెగ్యుల‌ర్ గా జ‌రిగే ప్రాసెస్. అదేం క‌ర్మో కానీ.. ప‌వ‌ర్ పోయాక కూడా ముఖ్య‌మంత్రికి ఉండే భ‌ద్ర‌త త‌మ అధినేత‌కు ఉండాల‌న్న మాట‌ను తెలుగు త‌మ్ముళ్లు అదే ప‌నిగా వినిపిస్తూ ఉంటారు. ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత అధికార‌ప‌క్ష నేత నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌గా మారిన త‌ర్వాత‌.. క‌చ్ఛితంగా ప్రోటోకాల్స్ మొత్తం మారిపోతుంటాయి. కానీ.. టీడీపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం త‌మ అధినేత‌కు క‌ల్పించే భ‌ద్ర‌త‌ను య‌థాత‌ధంగా ఉంచాల‌ని కోరుకోవ‌టం త‌ర‌చూ క‌నిపిస్తుంటుంది.

ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎలాంటి భ‌ద్ర‌త‌ను స‌మ‌కూర్చాలో అదే విధంగా భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసినా.. కుట్ర‌తో త‌మ అధినేత చంద్ర‌బాబుకు సెక్యురిటీ త‌గ్గించార‌న్న ఆరోప‌ణ త‌ర‌చూ వినిపిస్తూ ఉంటారు. నిజానికి ప‌వ‌ర్ పోయిన నెల రోజుల వ‌ర‌కూ కూడా సీఎంగా ఏర్పాటు చేసిన భ‌ద్ర‌త‌నే కొన‌సాగించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్పుచేస్తున్న వేళ‌.. అదేదో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కావాల‌ని చేస్తున్న‌ట్లుగా మీడియాలో ప్ర‌చారం చేసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలాంటి తీరును ప్ర‌జ‌లు త‌ప్పు ప‌డుతున్నారు. ఆ విష‌యాన్ని అయినా గుర్తించాల్సి ఉన్నా.. అది కూడా చేయ‌కుండా ప్ర‌తి దాన్లోనూ రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించ‌టంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన వెంట‌నే బాబు కుటుంబ స‌భ్యుల‌కు క‌ల్పించిన భ‌ద్ర‌త‌ను పూర్తిగా తొల‌గించారు. తాజాగా బాబు సొంతూరు నారావారి ప‌ల్లెలో క‌ల్పించిన భ‌ద్ర‌త‌ను మిన‌హాయించారు. ఇవ‌న్నీ పాల‌నా ప‌ర‌మైన అంశాలే త‌ప్పించి.. ఈ విష‌యాల మీద సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారంటూ ప్ర‌చారం చేయ‌టం అర్థం లేనివి. అయినా.. ప‌వ‌ర్ పోయిన త‌ర్వాత స్వ‌చ్చందంగా త‌మ‌కున్న సెక్యురిటీని ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేసే స‌త్ సంప్ర‌దాయాన్ని బాబులాంటి సీనియ‌ర్ నేత పాటించాల్సింది పోయి..రూల్స్ ప్ర‌కారం ప‌ని చేసిన అధికారుల‌పై రాజ‌కీయ నింద‌లు వేయ‌టంలో అర్థ‌మేమైనా ఉందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల తీరు చూస్తే.. బాబు ఇమేజ్ ను ఎవ‌రో దెబ్బ తీయాల్సిన అవ‌స‌రం లేదు.. సొంతోళ్లే త‌మ మాట‌ల‌తో డ్యామేజ్ చేస్తున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.


Tags:    

Similar News