తెలుగుదేశానికి బీజేపీ మరో హెచ్చరిక!

Update: 2019-07-01 05:13 GMT
'బలోపేతం కావడంలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడం కొనసాగుతుంది..' అని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం! ఏపీలో బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ ఇలాంటి మార్గానికే కట్టుబడినట్టుగా ఉంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించేశారు.

ఇటీవలే నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం నుంచి ఆ నలుగురుతో పాటు పలువురు నేతలు బీజేపీలోకి చేరారు. వారిలో ఓడిపోయిన వారున్నారు. తెలుగుదేశం హయాంలో నామినేటెడ్ పోస్ట్ లలో కొనసాగిన వారున్నారు. అయితే ఈ జాబితా ఇంతటితో ఆగదని తెలుస్తోంది.

పై ప్రకటనతో భారతీయ జనతా పార్టీ వాళ్లు తెలుగుదేశం పార్టీకి మరో హెచ్చరికను  చేసినట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పటికే వరదాపురం సూరి వంటి మాజీ ఎమ్మెల్యేను కూడా బీజేపీ చేర్చుకుంది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన పలువురు నేతలు ఇప్పుడు కమలం పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో బీజేపీ నేతలు మరింత మంది చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. చేరికలకు ఆహ్వానం అనే ప్రకటన చేశారు. ఇప్పటికే పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు వీడతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది తెలుగుదేశం అధిష్టానం. ఇలాంటి క్రమంలో తమ కార్యాలయం ముందు వెల్కమ్ బోర్డులను పెడుతున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీకి అంత మింగుడుపడే అంశం అయితే కాదని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

Tags:    

Similar News