ఆప‌రేష‌న్ సై'కిల్'.. తాజా టార్గెట్ చిన‌బాబు!

Update: 2019-06-21 05:22 GMT
టార్గెట్ చేశామంటే ఖ‌తం చేసేయాల్సిందే. కిక్కుర‌మ‌న‌కుండా చేయ‌టం ద్వారా ప్ర‌త్య‌ర్థిని కోలుకోలేనంత‌గా దెబ్బ కొట్టాల‌న్న వ్యూహాన్ని ఏపీలో ప‌క్కాగా అమ‌లు చేస్తోంది బీజేపీ. ఆప‌రేష‌న్ సైకిల్ లక్ష్యంగా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో భాగంగా బాబుపై గురి పెడుతూనే.. చిన‌బాబును ల‌క్ష్యంగా చేసుకోవటం క‌నిపిస్తోంది. ఎక్క‌డైనా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినంత‌నే.. ప‌రాజ‌యం పాలైన పార్టీలో అసంతృప్త గ‌ళాలు వినిపిస్తాయి. అందుకు భిన్నంగా రిజ‌ల్ట్స్ వ‌చ్చిన నెలకు ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాధ్య‌త తీసుకోక‌పోవ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్న తెలుగు త‌మ్ముళ్ల వైఖ‌రి ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రాంతీయ పార్టీల్లో ఎంత ప‌రాజ‌యం పాలైనా.. నేత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా తాజాగా టీడీపీలో నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. పార్టీకి చెందిన నేత‌లు పెద్ద ఎత్తున బీజేపీలోకి వెళ్లిపోయే వేళ‌.. పార్టీకి చెందిన కీల‌క నేత‌ల్ని ఇరుకున ప‌డేసే వ్యాఖ్య‌లు చేయ‌టం షురూ చేశారు. అందులో భాగంగా లోకేశ్ అంశాన్ని తాజాగా తెర మీద‌కు తెచ్చారు.

పార్టీ ఇంత ఘోరంగా ఎన్నిక‌ల్లో ఓడిన నేప‌థ్యంలో దాని బాధ్య‌త తీసుకొని లోకేశ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన లోకేశ్ రాజీనామా చేయాలంటూ తెలుగు త‌మ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. బాబు త‌న కుమారుడికి అవ‌స‌రానికి మించిన ప్రాధాన్య‌త ఇచ్చార‌ని.. అది న‌ష్టం చేసింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

భూకేటాయింపులు.. కొద్దిమందికే ప్రాధాన్య‌త‌లు ఇవ్వ‌టం.. ఎమ్మెల్యే టికెట్ల‌పై హామీలు.. ఆరోప‌ణ‌లు ఉన్న ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టంతో పాటు కాంట్రాక్టులు.. ఇత‌ర అంశాల్లో బాబును చిన‌బాబు పూర్తిగా ప్ర‌భావితం చేశార‌ని.. అదే పార్టీ ప‌రాజ‌యానికి కార‌ణంగా చెబుతున్నారు. అందుకే పార్టీ దారుణ ఓట‌మికి బాధ్య‌త తీసుకోవాల‌ని కోరుతున్నారు.  

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌స్తావ‌న రాని లోకేశ్ అంశం ఇప్పుడే తెర మీద‌కు ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చూస్తే.. ప‌క్కా వ్యూహంతోనే ఈ వ్య‌వ‌హారాన్ని తెర మీద‌కు తెచ్చార‌ని చెప్పాలి. పార్టీ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరుతున్న నేత‌ల తీరును త‌ప్పు ప‌ట్టే వారికి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండేందుకే ఈ కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చార‌ని చెప్పాలి.

పార్టీ మారే క్ర‌మంలో నేత‌ల‌పై విరుచుకుప‌డేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వంపై భారీ ఎత్తున ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేయ‌టం ద్వారా డిపెన్స్ లో ప‌డేయాల‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంది. ఇదంతా ముందుగా సిద్దం చేసుకున్న స్క్రిప్ట్ ప్ర‌కార‌మే సాగుతుంద‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు.
Tags:    

Similar News