వైసీపీ నేత‌ల చుట్టూ తెలుగు త‌మ్ముళ్ల ప్ర‌ద‌క్షిణ‌లు...

Update: 2019-07-11 06:07 GMT
పాపం తెలుగు త‌మ్ముళ్లు.. అధికారం కోల్పోవ‌డంతో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే ప‌ని.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన తెలుగు త‌మ్ముళ్ల ప‌రిస్థితి ఇప్పుడు ద‌య‌నీయంగా మారింది. అధికారంలో ఉండ‌గా చేప‌ట్టిన ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. ఆయా  ప‌నుల‌కు సంబంధించిన‌ బిల్లులు కూడా వ‌చ్చే ప‌రిస్థితులు ద‌రిదాపుల్లోనూ క‌నిపించ‌డం లేదు. ఈ ద‌య‌నీయ స్థితిలో త‌మ్ముళ్లు వైసీపీ నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు నానాతంటాలు ప‌డుతున్నారు.

ఇన్ని రోజులూ ఏపీలో టీడీపీకి త‌ప్ప మ‌రో పార్టీకి స్థానం లేద‌ని - చంద్ర‌బాబే త‌మ‌దేవుడంటూ భాజా వాయించిన నేత‌లంద‌రూ ఇప్పుడు వైసీపీ నాయ‌కుల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ముఖ్యంగా ఈ ప‌రిస్థితి కోస్తా జిల్లాలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఓ కీల‌క నేత‌లు - మ‌రికొంద‌రు నాయ‌కులు వైసీపీ నేత‌ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌మ‌కంటే.. చిన్న‌స్థాయిలో ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను కూడా క‌లిసేందుకు తెగ‌ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ నేత‌ల మ‌ద్ద‌తు లేకుండా చేసిన ప‌నుల బిల్లులు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అందుకే ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు వారి చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో... ముఖ్యంగా ప‌ట్ట‌ణంలో వంద‌ల‌ కోట్ల‌తో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు చాలా వ‌ర‌కు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. దాదాపుగా 20 శాతంలోపు అయిన ప‌నుల‌న్నింటినీ ఆపేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో వైసీపీ నేత‌ల అనుమ‌తి లేకుండా అధికారులు కూడా బిల్లులు ఇచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌నులు చేసిన వారంద‌రూ ఇప్పుడు ఆ బిల్లుల కోసం వైసీపీ నేత‌ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. వైసీపీ నేత‌లు మాత్రం తెలుగు త‌మ్ముళ్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక మ‌రికొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డంతో పాటు ప‌లు జిల్లాల‌కు చెందిన కీల‌క నేత‌లు బీజేపీలోకి వెళ్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News