హీరోయిన్ల వెంట ప‌డుడేనా.. హోదా ప‌ట్ట‌దా?

Update: 2018-03-20 09:57 GMT
తెలుగు త‌మ్ముళ్లు చెల‌రేగిపోతున్నారు. మైలేజీ మ‌త్తు క‌మ్మేసిన వారు.. హోదా సాధ‌న‌లో త‌మ‌దే హ‌వా అన్న‌ట్లుగా వారి మాట‌లు మొద‌ల‌య్యాయి. హోదా మీద మొద‌ట్నించి స్వ‌రం వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌.. ఆ మ‌ధ్య‌న వైజాగ్ లో నిర్వ‌హించిన నిర‌స‌న‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే.. విశాఖ ఎయిర్ పోర్టులో లొల్లి చేయ‌టం.. నానా ర‌భ‌స చేసి.. బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చేయ‌టం తెలిసిందే. పోలీసుల సాయంతో నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ స‌ర్కారు.. ఇప్పుడు హోదా మీద ప్ర‌ద‌ర్శిస్తున్న వైఖ‌రి చూస్తే.. వారిలో వ‌చ్చిన మార్పు అవాక్కు అయ్యేలా చేస్తుంద‌ని చెప్పాలి.

హోదా మీద మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించిన వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ నేత‌ల పుణ్య‌మా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా.. ఆ పార్టీ నేత‌ల మాట‌ల్లో చాలానే మార్పు వ‌చ్చింది. దీనికి తోడు జ‌న‌సేన అవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన సంచ‌ల‌న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న పార్టీ నేత‌లు ఇప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేయ‌టం క‌నిపిస్తుంది.

చూస్తుంటే.. మీడియాలో ఎక్క‌డ చూసినా.. ఏ వార్తలో అయినా త‌మ పార్టీ నేత‌ల మాట‌లే ఉండాల‌న్న తాప‌త్ర‌యం తెలుగు త‌మ్ముళ్ల‌లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. కొంద‌రునేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

తాజాగా ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ తెలుగు సినిమా హీరోల‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆస‌క్తిక‌రంగా మారాయి. అవార్డులు రాక‌పోతే గొడ‌వ‌లు చేసే సినిమా న‌టులు రాష్ట్రానికి అన్యాయం జ‌రిగితే ఎందుకు నోరు తెర‌వ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీకి న‌ష్టం వాటిల్లినా న‌టుల‌కు ప‌ట్ట‌టం లేద‌న్న ఆయ‌న‌.. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన హోదా కోసం పోరాడాల్సిన అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించారు. ఏపీకి న‌ష్టం వాటిల్లినా న‌టులు స్పందించ‌రా? అంటూ క్వ‌శ్చ‌న్ చేసిన ఆయ‌న‌.. ఏపీలోని తెలుగు సినీ న‌టులుంతా హాలీవుడ్ స్థాయి న‌టులు కాద‌న్నారు.

త‌మ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై త‌మిళ‌నటులు త‌ర‌చూ స్పందిస్తార‌ని.. కానీ ఏపీ న‌టులు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిర‌స‌న గ‌ళం వినిపించ‌టంలో త‌మిళ న‌టుల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.

ఎంత‌సేప‌టికి హీరోయిన్ల వెంట ప‌డ‌ట‌మే కానీ.. హోదా విష‌యం సినీ హీరోల‌కు ప‌ట్ట‌దా? అంటూ సీరియ‌స్ కామెంట్ చేసిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. వ‌య‌సు అయిపోతున్న న‌టుల‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వా? అని ప్ర‌శ్నించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రం మొత్తం ఆందోళ‌న చేస్తుంటే.. సినీ న‌టులు మాత్రం ఏసీ గ‌దుల్లో ఉంటున్నార‌న్నారు. అవార్డులు రాకుంటే నానా యాగీ చేసే న‌టులు ప్రత్యేక హోదా మీద ఎందుకు మాట్లాడ‌రు? అంటూ నిల‌దీశారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఇంత తీవ్ర‌స్థాయిలో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారిపై తెలుగు త‌మ్ముడు మాట్లాడ‌టం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News