నిరసనలు మంచిదే... ఇది సరిపోతుందా?

Update: 2018-02-05 09:06 GMT
మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. సోమవారం నాడు పార్లమెంటు సమావేశాలు మొదలు కాగానే.. తెలుగుదేశానికి చెందిన ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి నిరసనలు తెలియజేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీబొమ్మ వద్ద ప్లకార్డులు పట్టుకుని  కాసేపు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్లు వినిపించారు. మొత్తానికి ప్రజల ఛీత్కారాలకు గురికాకుండా తెలుగుదేశం ఎంపీలు ఒక అడుగు పోరాటం దిశగా వేసినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఆవరణలో మాత్రం కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా కూడా వారితో కలిసి గళం కలపగా, గాంధీ బొమ్మ వద్దకు ఆయన రాకపోవడం విశేషం. కనీసం ఒక్క అడుగైనా వేసినందుకు తెలుగుదేశం వారిని కొంత అభినందించాల్సిందే.

అయితే బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్ది, న్యాయం జరిగేలా కేంద్రంలో కదలిక తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నం సరిపోతుందా? అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలదని.. ఇది కేవలం మొక్కుబడి పోరాటం తంతు లాగానే ఉన్నదని కూడా కొందరు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తలచుకుంటే.. కేంద్రంలో కదలిక వచ్చేలా గట్టిపోరాటం సాగించడమూ సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈనెలలో పార్లమెంటు సమావేశాలు మిగిలిఉన్నది కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే. తెలుగుదేశం ఎంపీలు ఈ నాలుగు రోజులు మాత్రమే నిరసనలు తెలియజేస్తారా? లేదా.. తమ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కంటిన్యూ చేస్తారా? అనేది కీలకమైన అంశం.

ఎందుకంటే.. నాలుగురోజుల పోరాటంతో అచ్చంగా ఏమీ ఒరగకపోవచ్చుననేది జనాభిప్రాయం. తెలుగుదేశం తలచుకుంటే.. కేవలం పార్లమెంటు ముంగిట్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్రం పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపేలా ప్రజాందోళనలకు పిలుపు ఇవ్వవచ్చు. దానికి వచ్చే ప్రజాస్పందనను బట్టి.. అసలు ఏపీ రాష్ట్ర ప్రజల్లో ఈ బడ్జెట్ పట్ల ఎంత ఆగ్రహం పెల్లుబుకుతున్నదో కేంద్రానికి ప్రత్యక్షంగా తెలియజెప్పడం వీలవుతుంది. అలాంటి ‘లార్జర్ దేన్ లైఫ్ సైజ్’ కార్యాచరణకు దిగితే తప్ప.. ఏపీకి సాయం చేసే విషయంలో జడత్వం పేరుకుపోయిన మోడీ సర్కారులో కదలిక తీసుకురావడం కష్టం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీలు ఇవాళ రేపు మిగిలిన నాలుగురోజులు కూడా ప్లకార్డుల నిరసనలు చెప్పేసి.. తర్వాత.. ఊరకుండిపోకూడదని.. మళ్లీ పార్లమెంటు రెండో సెషన్ మొదలయ్యే వరకు ఢిల్లీని వీడకుండా.. పార్లమెంటు ఆవరణలోనే గానీ.. జంతర్ మంతర్ వద్ద రోడ్డు పై కూర్చుని తమ నిరసనలను ఆందోళనను ఆవేదనను వారికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News