చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో.. టీడీపీ మూలాల్లోనే దెబ్బ‌తింటోందా!

Update: 2021-09-20 11:32 GMT
ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో త‌గిలిన ఎదురుదెబ్బ నేప‌థ్యంలో టీడీపీ తాము ఆ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన‌ట్టుగా చెప్పుకుంటోంది. తాము బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల‌నే అలాంటి ఫ‌లితాలు అంటోంది. అయితే తెలుగు రాజ‌కీయాల్లో ఇలాంటి బ‌హిష్క‌ర‌ణ‌లు వ‌ర్క‌వుట్ అయ్యేవేనా? అనేది ఆలోచించాల్సిన అంశం. ఎక్క‌డో త‌మిళ‌నాడులో ప్రాంతీయ పార్టీలు ఈ త‌ర‌హా ప‌నులు చేస్తూ ఉంటాయి. అయితే అది త‌మిళ‌నాట చెల్లుతుంది. త‌మిళ‌నాటే ఎందుకు చెల్లుతుందంటే.. అక్క‌డ ప్ర‌జ‌లు ఏ ప్ర‌భుత్వాన్ని అయినా ఐదేళ్ల కు మించి ఉంచ‌రు!

ప్ర‌తి ఐదేళ్ల‌కూ ప్ర‌భుత్వాల‌ను మార్చేయ‌డం త‌మిళుల‌కు బాగా అల‌వాటు. 2016లో జ‌య‌ల‌లిత రెండోసారి గెల‌వ‌డాన్ని మిన‌హాయిస్తే.. అంత‌కు ముందు చాలా కాలం పాటు త‌మిళులు ప్ర‌తి ఐదేళ్ల‌కూ ఒక సారి ప్ర‌భుత్వాన్ని మార్చేస్తూ వ‌చ్చారు. అంత‌కు ముందు వ‌ర‌స‌గా నెగ్గింది ఎంజీఆర్ మాత్ర‌మే. క‌రుణానిధి, జ‌య‌ల‌లిత ల మ‌ధ్య‌న రాజ‌కీయ వార్ న‌డిచిన‌న్ని రోజులూ.. ప్ర‌తి ఐదేళ్ల‌కూ ఒక‌రు గ‌ద్దెదిగ‌డం, మ‌రొక‌రు గ‌ద్దెనెక్క‌డం రొటీన్ గా జ‌రిగింది. దీంతో మ‌ధ్య‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను తమిళ పార్టీలు ప‌ట్టించుకునేవి కావు. అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికీ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌ను మార్చేస్తారు కాబ‌ట్టి, ఇక మ‌ధ్య‌లో వ‌చ్చే ఉప ఎన్నిక‌లు, స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం కూడా వ్య‌ర్థం అన్న‌ట్టుగా త‌మిళ రాజ‌కీయాలు సాగాయి. దీంతో బై పోల్స్ ను ఆ పార్టీలు లైట్ తీసుకున్నాయి.

అది త‌మిళ రాజ‌కీయం. అయితే.. తెలుగు రాజ‌కీయం అందుకు భిన్నం. రాజ‌కీయ‌మే ప‌నిగా పెట్టుకునే వారు గ్రామాల్లో బోలెడంత మంది ఉండే రాష్ట్రం మ‌న‌ది. గ్రామ స్థాయి నుంచినే రాజ‌కీయ చైత‌న్యం ఉంటుంది ఏపీలో. ప్ర‌తి పార్టీకీ క్యాడ‌ర్ ఉంటుంది. ఆ క్యాడ‌ర్ పార్టీ చొక్కాల‌ను వేసుకుని తిరుగుతుంది అనునిత్యం. వారికి రాజ‌కీయం ప్ర‌తిష్టాత్మ‌కం. పార్టీ అధికారంలో ఉందా.. లేదా.. అనేది కాదు, పోటీ అనేదే ప్ర‌తిష్టాత్మ‌కం. తాము న‌మ్మిన పార్టీ, తాము న‌మ్ముకున్న పార్టీ.. అనే సెంటిమెంట్ ఏపీ లో ఉంటుంది.

మ‌రి అలాంటి క్యాడ‌ర్ కు ఎన్నిక‌లు వ‌స్తే చేతినిండా ప‌ని. సొంత ఖ‌ర్చులు పెట్టుకుని సైతం ప‌ని చేయ‌డానికి వెనుకాడ‌రు వారు. గెలుపా, ఓట‌మా.. అనేది వారికి లెక్క కాదు. అయితే.. టీడీపీ ఇప్పుడు బ‌హిష్క‌ర‌ణ పిలుపుల‌తో మ‌రింత ప‌లుచ‌న అవుతోంది. అస‌లు పోలింగ్ కు ముందు చంద్ర‌బాబు నాయుడు బ‌హిష్క‌ర‌ణ పిలుపు ఇవ్వ‌డ‌మే వారికి ఇన్స‌ల్ట్ అయ్యింది. చంద్ర‌బాబు ఏమీ డ‌బ్బులు పంప‌న‌క్క‌ర్లేదు, ప్ర‌చార‌మూ అక్క‌ర్లేదు. అయితే బ‌హిష్క‌ర‌ణ పిలుపుతో అప్ప‌టి వ‌ర‌కూ పోరాడుతున్న క్యాడ‌ర్ ఉత్సాహంపై చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లారు.

తిరుప‌తి ఉప ఎన్నిక‌కు కూడా అప్పుడే స‌న్నాహాలు సాగుతుండేవి. దీంతో అక్క‌డ కూడా టీడీపీ లో నిరుత్సాహం వ‌చ్చింది. తిరుప‌తి ఎంపీ సీటు ఉప ఎన్నిక అభ్య‌ర్థి కి చంద్ర‌బాబు పిలుపుతో ద‌డ మొద‌లైంద‌ట‌. ఉప ఎన్నిక‌కు ప్రిపేర్ అవుతున్న క్యాడ‌ర్ కు చంద్ర‌బాబు పిలుపుతో నీర‌సం రావ‌డంలో వింత లేదు మ‌రి. అటు తిరుప‌తి ఉప ఎన్నికా పోయింది, పార్టీ గుర్తు బ్యాలెట్ పేప‌ర్ మీద ఉండి, బ‌హిష్క‌ర‌ణ పేరుతో ఇటు ప‌రువూ పోయింది.

ఓట‌మి, చిత్తుగా ఓడిపోవ‌డం పై బ‌హిష్క‌ర‌ణ పిలుపు పేరుతో టీడీపీ క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు కానీ, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో టీడీపీ న‌మ్మ‌కాన్ని కోల్పోతోంది. ఏ ఎన్నిక‌ల విష‌యంలో చంద్ర‌బాబు ఏం చేస్తాడో.. అనే భ‌యం ప‌చ్చ పార్టీ శ్రేణుల్లోకి ఇప్పుడు గ‌ట్టిగా వెళుతుంది. రాజ‌కీయం అంటూ రొమ్ము విరుచుకు తిరిగిన ప‌చ్చ చొక్కాల్లో కూడా పూర్తి అభ‌ద్ర‌తాభావాన్ని చంద్ర‌బాబు ఇంజ‌క్ట్ చేశార‌ని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.


Tags:    

Similar News