వైసీపీ ప్లీన‌రీ.. టీడీపీలో వ‌ర్రీ

Update: 2017-07-07 08:11 GMT
వైసీపీ ప్లీన‌రీ ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్యంగా పాల‌క టీడీపీని అది చాలా భ‌య‌పెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. వైసీపీ ప్లీనరీ నిర్వ‌హించ‌డం కొత్తేమీ కాక‌పోయినా ఈసారి ప్లీన‌రీ సంద‌ర్భంగా మాత్రం అట్ట‌హాసం, ఉత్సాహం, రెట్టించిన ఆత్మ‌విశ్వాసం అన్నీ క‌నిపిస్తున్నాయి. వైసీపీలో క‌నిపిస్తున్న ఈ పండుగ వాతావ‌ర‌ణం.. పాల‌క టీడీపీని తెగ కంగారుపెడుతోంద‌ట‌.  ఇంత ఉత్సాహం, ఇంత ఊపు వైసీపీలో క‌నిపించ‌డానికి కార‌ణ‌మేంటి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న ప‌రిస్థితేంటి..  రాష్ట్రం న‌డిబొడ్డున వైసీపీ వేలాదిమందితో ప్లీన‌రి నిర్వ‌హిస్తే ఆ పార్టీకి వ‌చ్చే మైలేజి వంటివ‌న్నీ టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

గ‌తంలో వైసీపీ ప్లీన‌రీ అంటే ఇడుపుల‌పాయ‌లో సాదాసీదాగా జ‌రిపించేవారు. కానీ, ఈసారి  ప్రధాన ప్లీనరీకి ముందు నియోజకవర్గ స్థాయి - జిల్లా స్థాయి ప్లీనరీలను కూడా భారీగా జ‌రిపారు.  రాష్ట్రం న‌డిబొడ్డున గుంటూరులో సుమారు 30 వేల మందితో నిర్వ‌హించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని టాక్. అంతేకాదు... ఇంత భారీ ఎత్తున ప్లీన‌రి నిర్వ‌హించ‌డానికి డ‌బ్బెవ‌రు పెడుతున్నారు.. పారిశ్రామికవేత్తలెవరైనా జ‌గ‌న్ ప‌క్షం వ‌హిస్తున్నారా అనేది ఆరా తీయ‌డానికి ఇంటిలిజెన్సును రంగంలోకి దించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా రాజధాని ప్రాంతంలో ప్లీన‌రీని భారీగా నిర్వ‌హించ‌డం వ‌ల్ల పార్టీ రేంజేంటో జ‌నాల‌కు మ‌రోసారి తెలుస్తుంద‌న్న‌ది వైసీపీ వ‌ర్గాల  అభిప్రాయం. మ‌రోవైపు ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లోనూ జోష్ నింపేందుకు కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.  జ‌గ‌న్ స్వ‌యంగా దీనిపై దృష్టి పెట్టి దీన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి నేత‌ల‌ను ముందుకు కదిలిస్తున్నారు.

చంద్ర‌బాబు స్వ‌యంగా చేయిస్తున్న స‌ర్వేల్లోనూ టీడీపీ గ్రాఫ్ ప‌డిపోతున్న విష‌యం బ‌య‌ట‌ప‌డుతుండ‌డం.. ఇదే స‌మ‌యంలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతుండ‌డం.. ఇప్పుడు జ‌గ‌న్ కూడా హైద‌రాబాద్ కేంద్రంగా కాకుండా అమ‌రావ‌తి ప్రాంతం కేంద్రంగా రాజ‌కీయాలు నెరుపుతుండ‌డం... ఇప్పుడు భారీస్థాయిలో ప్లీన‌రీ నిర్వ‌హిస్తుండ‌డంతో టీడీపీ కంగారుప‌డుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.
Tags:    

Similar News