మార్స్ మీద అడుగుపెట్టే మొద‌టి వ్య‌క్తి ఆమేన‌ట‌!

Update: 2018-07-13 08:14 GMT
పెద్దయ్యాక అలా కావాలి?  ఇలా కావాలి? అనుకోవ‌టం చిన్న‌త‌నంలో అంద‌రూ చేసే ప‌ని. కానీ.. చిన్న‌ప్పుడు తామేం అనుకున్నామో స‌రిగ్గా అదే అయ్యే వారు చాలా చాలా త‌క్కువ‌గా ఉంటారు. చిన్న‌నాటి క‌ల‌.. ఎప్ప‌టికి తీర‌ని క‌ల‌గా ఉండిపోవ‌టం చాలామందిలో క‌నిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇందుకు భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17ఏళ్ల టీనేజ‌ర్ ఇందుకు మిన‌హాయింపుగా చెప్పాలి.

ఎందుకంటే.. మార్స్ గ్ర‌హం.. అదేనండి అంగార‌క గ్ర‌హం మీద కాలుమోపే తొలి మ‌హిళ‌గా ఆమె పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే ఆమె.. ఆ గ్ర‌హం మీద‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంటోంది. ప్ర‌స్తుతం 17 ఏళ్ల వ‌య‌సులో ఉన్న ఆమె.. అంగార‌క గ్ర‌హం మీద‌కు వెళ్లేది మాత్రం ఆమెకు 32 ఏళ్ల వ‌య‌సులో. అంటే.. 2033లో అన్న మాట‌.

ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ ప్ర‌యోగం కోసం ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. నాసా పోలార్ ఆర్బిట‌ల్ సైన్స్.. జీరో గ్రావిటీ.. అండ‌ర్ వాట‌ర్ స‌ర్వ‌యివ‌ల్‌.. త‌దిత‌ర కార్య‌క్ర‌మాల్లో ప్రాథ‌మికంగా శిక్ష‌ణ తీసుకుంటున్న ఆమె.. ప‌ద్దెనిమిదేళ్ల త‌ర్వాత‌నే అధికారికంగా నాసా ఆమెను వ్యోమోగామిగా గుర్తించ‌నున్నారు.
 
ప్ర‌స్తుతం ఆమె బ్లూ బెర్రీ సాంకేతిక నామంతో ప‌ని చేస్తున్నారు. మార్స్ గ్ర‌హానికి వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన ఆరియ‌న్ అంత‌రిక్ష నౌక .. స్పేస్ లాంఛ్ సిస్ట‌మ్ రాకెట్ కు సంబందించిన శిక్ష‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌లో అంగార‌క గ్ర‌హానికి వెళ్ల‌టానికి ఆర్నెల్ల స‌మ‌యం ప‌డుతుంది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఏడాది పాటు అక్క‌డే ఉండ‌నుంది. ఆమెతో పాటు మ‌రికొంద‌రు వ్యోమోగాములు కూడా అక్క‌డికి వెళ్ల‌నున్నారు.

ఈ ప్ర‌యోగంలో అంగార‌క గ్ర‌హం మీద ప‌రిస్థితులు.. నీటి వ‌న‌రులు.. అక్క‌డ మ‌నిషి జీవించేందుకు ఉన్న అవ‌కాశాలు.. జీవ జాతుల జాడ‌ల గురించిన అన్వేష‌ణను చేస్తారు. అక్క‌డ నివాసానికి ఇళ్ల‌ను నిర్మించ‌టానికి ఉన్న అవ‌కాశాల‌పైనా అధ్య‌య‌నం చేస్తారు. చిన్న‌త‌నం నుంచే అంగార‌క గ్ర‌హం మీద‌కు వెళ్లే కార్టూన్ ఎపిసోడ్ ను చూసిన కార్బ‌న్ కు బ‌ల‌మైన ముద్ర వేసింది. అప్ప‌టి నుంచి ఇదే విష‌యం మీద సాగుతున్న ఆలోచ‌న‌లు.. ఆమెను ఆ దిశ‌గా న‌డిచేలా చేయ‌ట‌మే కాదు.. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఎవ‌రికి ద‌క్క‌ని అరుదైన అవ‌కాశం ఆమెకు ద‌క్కేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News