గులాబీ కారు జోరుకు షాకిచ్చేందుకు తీన్మార్ మల్లన్న సరికొత్త ప్లానింగ్

Update: 2021-03-23 06:30 GMT
తెలంగాణ రాజకీయ సంచలనంగా మారిన తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ నేతలకు కొత్త భయంగా మారారు. తాజాగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు పడిన ఓట్లు.. ఓవర్ నైట్ ఆయన ఇమేజ్ ను భారీగా పెంచేసింది. అన్నింటికి మించి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో సరిసమానంగా.. మరికొన్నిసందర్భాల్లో అన్నీ తానై అన్నట్లు వ్యవహరించి.. వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లిన కోదండం మాష్టారు లాంటి పెద్దమనిషి ఎన్నికల్లో చతికిల పడిన వైనం షాకింగ్ గా మారింది.

కేసీఆర్ జోరుకు ఆయన స్టైల్లోనే బ్రేకులు వేసే తీన్మార్ మల్లన్న మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే వారు తెలంగాణలో అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ ఊపును కొనసాగించేందుకు వీలుగా సంచలన నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న తీసుకుంటున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మరికొద్దిరోజుల్లో జరిగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్ల నేపథ్యంలో.. అర్జెంట్ గా ఆయన్ను బీజేపీలోకి చేర్చుకోవాలన్న సూచన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రయత్నాన్ని ఇప్పటికే మల్లన్నకు సన్నిహితంగా ఉండే బీజేపీ ఎంపీ ఒకరు తెర మీదకు తీసుకొచ్చారని చెబుతున్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్ ను మల్లన్న సున్నితంగా రిజెక్టు చేసినట్లు తెలుస్తోంది. తనకొచ్చిన తాజా ఇమేజ్ ను ఖరాబు చేసుకోవాలన్న యోచనలో లేనని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే..సాగర్ ఉప ఎన్నికల పోరు మరోస్థాయికి వెళుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News