తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న వైనం గడిచిన వారంగా ఎంత సంచలనంగా మారిందన్న విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా ఉన్నదా? అన్నదే ప్రశ్న.
అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. పూర్తిగా సాంకేతికాంశమేనని చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరగటానికి ఆరు నెలల గరిష్ఠ కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అంటే.. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కచ్ఛితంగా అసెంబ్లీని కొలువు తీర్చాల్సిందే. ఈ లెక్కలో చూసినప్పుడు గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 13 నుంచి 29 వరకు సాగాయి. అయితే.. అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసింది మాత్రం జూన్ 1న.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రోరోగ్ చేయటం మామూలే. కానీ.. అందుకు భిన్నంగా సమావేశాలు ముగిసిన రెండు నెలల వరకూ ప్రోరోగ్ చేయకుండా ఉన్న ఆయన.. చివరకు జూన్ 1న ప్రోరోగ్ చేశారు. నాటి నుంచి ఆర్నెల్ల వ్యవధిలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే లెక్కలోకి తీసుకుంటే డిసెంబరు ఒకటి కంటే ముందు సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. కేసీఆర్ కోరుకున్నట్లు ముందస్తులోకి వెళ్లిన పక్షంలో.. రాజ్యాంగ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు అపధర్మంగా ఉండే ప్రభుత్వం కాస్తా గవర్నర్ పాలనలోకి వెళుతుంది. అదే జరిగితే.. కేసీఆర్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.
ఒకవేళ.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా సభను రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన పక్షంలో కేసీఆర్ సర్కారు అపధర్మంలో పడుతుంది. ఏదైనా సాంకేతిక కారణాల్ని చూపిస్తూ ఈసీ కానీ కొర్రి పెట్టి ఎన్నికల్ని వాయిదా వేస్తే.. అసెంబ్లీ ఆర్నెల్ల వ్యవధిలో కొలువు తీరాల్సి ఉండి.. తీరని నేపథ్యంలో రాష్ట్రపతి పాలనలోకి వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే పరిస్థితి మొత్తం మారుతుంది.
ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా అసెంబ్లీ రద్దుకు ముందు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తే.. మళ్లీ ఆర్నెల్ల వరకూ సమావేశాన్నినిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఆ లోపు ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే..కొత్త సభ కొలువు తీరుతుంది. ఈ ఉద్దేశంతోనే ఢిల్లీలో తనకు సానుకూల సంకేతాలు అందిన తర్వాత.. బహిరంగ సభ అనంతరం అసెంబ్లీని కొలువు తీర్చి.. ఆ తర్వాత రద్దుకు సీఎం కేసీఆర్ సిఫార్సు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.