టైం చూసుకొని కాంగ్రెస్ ను ఖ‌తం చేసేస్తారా?

Update: 2019-06-16 05:59 GMT
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే చాలు.. తిరుగులేని అధికారం త‌మ సొంత‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేసుకొని మ‌రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యంతో తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌కెప్ప‌టికి భావోద్వేగంతో త‌మ‌కు క‌నెక్ట్ అయి ఉంటార‌న్న అంచ‌నాలో దొర్లిన తేడా ఇప్పుడు ఆ పార్టీ కొంప ముంచే వ‌ర‌కూ వ‌చ్చింది.

ప్ర‌జాక్షేత్రంలో టీఆర్ ఎస్ తిరుగులేని విజ‌యం.. కాంగ్రెస్ లో నాయ‌క‌త్వ లేమితో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దీనికి తోడు కేసీఆర్ మొద‌లెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో ఇప్పుడా పార్టీ ఉనికికే ప్ర‌మాదంగా మారింది. ఐదేళ్లు అధికారంలో దూరంగా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. రానున్న ఐదేళ్లు అలాంటి ప‌రిస్థితే అయితే ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న భావ‌న కాంగ్రెస్ నేత‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాభ‌వం అంత‌కంత‌కూ త‌గ్గుతున్న వేళ‌.. మునిగే నావ‌లా ఉన్న పార్టీని  ప‌ట్టుకొని వేలాడ‌టంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇందులో భాగంగానే వారి చూపులు బీజేపీ మీద ప‌డ్డాయి. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం.. కేసీఆర్ కుమార్తె క‌విత‌ను బీజేపీ అభ్య‌ర్థి ఓడించ‌టంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో బీజేపీ ప‌ట్ల ఉన్న ఆద‌ర‌ణ‌.. న‌మ్మ‌కం కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త ఆలోచ‌న‌ల్లో ప‌డేసేలా చేశాయి.

ఇదే స‌మ‌యంలో దక్షిణాదిన క‌ర్ణాట‌క త‌ప్పించి మ‌రే రాష్ట్రంలోనూ త‌మ ఉనికి లేని వేళ‌.. తెలంగాణ‌లో ప‌ట్టు సాధించేందుకు వ‌చ్చిన సువ‌ర్ణావ‌కాశాన్ని వ‌దులుకోకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఉంది. త‌మ పార్టీలో బ‌ల‌మైన కాంగ్రెస్ నేత‌ల‌ను చేర్చుకోవ‌టం ద్వారా టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా మారాల‌ని భావిస్తోంది. పాల‌నా ప‌రంగా కేసీఆర్ చేస్తున్న త‌ప్పులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని.. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో.. దాన్ని అస‌రాగా చేసుకొని రాజ‌కీయంగా ఎదిగేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కోమ‌టిరెడ్డి.. రేవంత్ రెడ్డి లాంటి బ‌ల‌మైన ప్ర‌జాక‌ర్ష‌క నేత‌ల‌తో పాటు.. మ‌రొక‌రు ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల్ని క‌లిపి గుండుగుత్తుగా పార్టీలోకి తీసుకురావ‌టం ద్వారా బీజేపీని కొత్త ర‌క్తంలో నింపాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఖ‌త‌మైన‌ట్లేన‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్. . రేవంత్ త‌దిత‌రులు కాషాయ‌కండువా క‌ప్పుకొని..కాంగ్రెస్ ను ఖ‌తం ప‌ట్టిస్తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  


Tags:    

Similar News