గ‌వ‌ర్న‌ర్ ను అంత‌లా క‌డిగేశార‌ట‌!

Update: 2018-01-06 05:57 GMT
సంచ‌ల‌నం. నిజంగానే సంచ‌ల‌నం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత కాస్త కామ్ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడిప్పుడే గ‌ళం విప్పుతున్నారు. యాక్టివ్ అవుతున్నారు. ఇంత‌కాలం నిద్రాణంగా ఉన్న నేత‌లు ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న సంకేతాలు ఇచ్చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌ట్టే ప‌నిలో తెలంగాణ విపక్షాలు వెనుక‌బ‌డి ఉన్నాయ‌న్న‌ విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా కేసీఆర్ స‌ర్కారు తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి మొర పెట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి స‌మ‌యాల్లో నేత‌లంతా క‌లిసి రాజ్ భ‌వ‌న్‌ కు వెళ్ల‌టం.. గ‌వ‌ర్న‌ర్‌ ను క‌ల‌వ‌టం చేస్తుంటారు. నేత‌లు ఇచ్చిన విన‌తి ప‌త్రాల్ని అందుకున్న గ‌వ‌ర్నర్‌.. విష‌యాల్ని తాను ప‌రిశీలిస్తాన‌ని.. స్పందిస్తాన‌ని చెప్ప‌టం.. అందుకు ఓకే అంటూ నేత‌లు వెన‌క్కి వచ్చేస్తుంటారు. త‌మ‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌కు త‌మ డిమాండ్ ల‌ను గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లామ‌ని.. సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్ప‌టం క‌నిపిస్తుంది.

తాజా ఎపిసోడ్‌ లో అలా జ‌ర‌గ‌లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా.. మంద‌కృష్ణ మాదిగ అరెస్ట్ విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు.. రోటీన్‌ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. త‌మ ఫిర్యాదుల‌పై గ‌వ‌ర్న‌ర్ సానుకూలంగా స్పందించ‌టం లేద‌న్న ఆరోప‌ణ‌కు.. గ‌వ‌ర్న‌ర్ నుంచి వ‌చ్చిన స‌మాధానం.. కాసేప‌టికే మాట‌ల యుద్ధంగా మారింద‌న్న సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల కాలంలో ఆచితూచి అన్న‌ట్లుగా వార్త‌లు ఇచ్చే ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు సైతం.. గ‌వ‌ర్న‌ర్ కు.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ధ్య న‌డిచిన మాట‌ల యుద్ధం మీద భారీ ఎత్తున క‌థ‌నం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఒక ప్ర‌ధాన మీడియా సంస్థ అయితే.. కాంగ్రెస్ నేత‌లు ఏం మాట్లాడారు.. దానికి గ‌వ‌ర్న‌ర్ ఏం బ‌దులిచ్చారు.. అప్పుడేం జ‌రిగింది? అన్న విష‌యాల్ని డీటైల్డ్ గా ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. హుందాగా ఉండే గ‌వ‌ర్న‌ర్.. నేత‌ల మ‌ధ్య మాట‌ల‌కు భిన్నంగా ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకోవ‌టం విశేషం. నేత‌లే కాదు.. కొన్ని సంద‌ర్భాల్లో గ‌వ‌ర్న‌ర్ సైతం సంయ‌మ‌నం కోల్పోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.

కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన ఈ స‌మాచారాన్నికొన్ని మీడియా సంస్థ‌లు  డీటైల్డ్ గా ఇచ్చాయి. సంచ‌ల‌నంగా మారిన ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు రిపోర్ట్ చేసిన అంశాల్లో కీల‌క‌మైన విష‌యాల్ని చూస్తే..

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి వెంట‌నే కుశ‌ల ప్ర‌శ్న‌లు న‌డిచాయి. కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్షల్ని ఒక‌రికొక‌రు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెల‌రేగిపోతోంద‌ని.. దీన్ని కంట్రోల్ చేయాల్సిన ప్ర‌భుత్వం ఆ ప‌ని చేయ‌టం లేద‌ని.. కామారెడ్డి జిల్లాలో ఒక వీఆర్ ఏను ట్రాక్ట‌ర్ల‌తో తొక్కించి హ‌త్య చేసిన వైనాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకురావ‌టంతోపాటు.. ఈ ఉదంతం నేప‌థ్యంలో ఊరంతా పోలీసుల‌తో నింపేశార‌న్నారు. ఇసుక త‌వ్వ‌కాల‌తో ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని.. మైనింగ్ మంత్రి కేటీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిరిసిల్ల‌లోని నేరెళ్ల‌లో కూడా అక్క‌డి గ్రామ‌స్తుల్ని మైనింగ్ మాఫియా.. పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టిన‌ట్లుగా చెప్పారు.

నేరెళ్ల బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌టానికి మీరా కుమార్ వ‌స్తే చుల‌క‌న చేశార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ నేర‌ళ్ల ఘ‌ట‌న‌లో బాధ్యులైన ఒక్క‌రిపైనా చ‌ర్య‌లు లేవ‌న్నారు. ఇసుక మాఫియాతో మంత్రి కేటీఆర్ బంధువుల‌కు సంబంధం ఉంద‌న్నార‌ని.. లేకుంటే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని త‌మ ఆవేద‌న‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఉత్త‌మ్ తో పాటు ష‌బ్బీర్ అలీ.. డీకే అరుణం..పొంగులేని త‌దిత‌రులు త‌మ దృష్టికి వ‌చ్చిన అంశాల్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి స్పందించిన గ‌వ‌ర్న‌ర్.. చ‌నిపోయిన వ్య‌క్తి  వీఆర్ఏ కాద‌ని.. ప్ర‌భుత్వ ఉద్యోగి కూడా కాద‌న్నారు. వేరే కార‌ణాల‌తో చ‌నిపోయిన‌ట్లు త‌న‌కు తెలిసింద‌ని.. ట్రాక్ట‌ర్ తో గుద్దించి చంపింది వాస్త‌వం కాదంటూ వ్యాఖ్యానించారు. మీ రాజ‌కీయ నాయ‌కుల‌కు అక్క‌డేం ప‌ని?  రాజ‌కీయ నాయ‌కులు అక్క‌డికి ఎందుకు వెళుతున్నారు? ఇసుక మాఫియా ఇంత‌కు ముందు లేదా?  ఇప్పుడే కొత్త‌గా వ‌చ్చిందా? అంటూ ప్ర‌శ్నించారు. దీనికి ఉత్త‌మ్ స్పందిస్తూ.. రాజ‌కీయ‌నాయ‌కుల్ని పోవ‌ద్దంటారేంది? ప‌్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌టం త‌మ ప‌ని అని.. తాము ఎక్క‌డికైనా వెళ‌తామ‌ని.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల మీద దృష్టి సారిస్తామ‌ని.. గ‌వ‌ర్న‌ర్ శాంతి భ‌ద్ర‌త‌ల్ని ప‌ర్య‌వేక్షించాల్సిందేన‌న్నారు.

దీనికి బ‌దులుగా గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తూ.. మీరు  ముఖ్య‌మంత్రి.. ఆయ‌న కుమారుడి మీద ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఉత్త‌మ్ కించిత్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. "అయాం సారీ. మేమేం చేయాలో మీరు మాకు చెప్పలేరు. మేం మాట్లాడతాం. మీరు వినాలి. అది మీ బాధ్యత"   అని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంలో సర్వే సత్యనారాయణ జోక్యం చేసుకొని మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌గా..  గవర్నర్‌ వారించారు. దీంతో సర్వే ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

 త‌మ‌ను పిల్ల‌లుగా అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తూ.. మేం పిల్ల‌లైతే.. మీరు టీచ‌రా?  హెడ్ మాస్ట‌ర్ లా బిహేవ్ చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ హోదాకు త‌గిన‌ట్లుగా మాట‌ల్లేవ‌ని వ్యాఖ్యానించారు. అయితే.. సీఎంను.. ఆయ‌న కొడుకును అలా ఎలా వెనుకేసుకొస్తారంటూ.. టీఆర్‌ ఎస్‌ ఏజెంటులా మాట్లాడుతున్నారు? సీఎంకు పక్షపాతిలా వ్యవహరిస్తున్నారు? అని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన గ‌వ‌ర్న‌ర్ త‌న‌ను సీఎం ప‌క్ష‌పాతి అని అంటారా?  అలా అయితే తాను ఎందుకని పేర్కొంటూ వెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి స్పందించిన స‌ర్వే.. ఏం అనుకొని పోతానంటున్నావ్‌.. మంద కృష్ణ మాదిగ‌ను అరెస్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? ఏం విష‌యాలు చెప్పుకుపోవ‌ద్దా? అంటూ ప్ర‌శ్నించారు. గాంధేయ ప‌ద్ధ‌తిలో మంద‌కృష్ణ నిర‌స‌న తెల‌ప‌టం త‌ప్పా? అంటూ ప్ర‌శ్నించారు. ఆ మాత్రానికే అరెస్ట్ చేస్తారా?  జైల్లో పెడ‌తారా? ద‌ళితుల అంశాల‌పై ప్ర‌భుత్వానికి ఇంత చిన్న‌చూపా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

దీనికి బ‌దులిచ్చిన గ‌వ‌ర్న‌ర్.. "మంద కృష్ణ దీక్షతో శాంతి భద్రతల సమస్య వస్తుందని రిపోర్టులున్నాయి. అందుకే అరెస్టు చేసి ఉంటారు. అయినా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నాడు కదా? ఓకే.. నేను రిపోర్టు తెప్పించుకుంటా. ఉద్యమ సమయంలో మీరు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే నా మీదికి వచ్చిన వారిని కంట్రోల్‌ చేయలేదు. మీరు సరిగా స్పందించలేదు" అన్న వ్యాఖ్య చేశారు.  దీనికి స్పందించిన ఉత్త‌మ్ ఎప్పుడో జ‌రిగిపోయిన విష‌యాల మీద ఇప్పుడెందుకు?  అలాంటి వాటిని మ‌న‌సులో పెట్టుకునే ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదే స‌మ‌యంలో క‌ల్పించుకున్న స‌ర్వే..  "గవర్నర్‌ సాబ్‌! మర్చిపోతున్నారు. సోనియా గాంధీ - మన్మోహన్‌ సింగ్‌ లు నిన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. మా గురించే అట్ల మాట్లాడుతున్నావ్‌. మొక్కి మొక్కి దండాలు పెట్టి కుర్చీలో కొనసాగుతున్నవ్‌. ఇంకెందుకు.. నీ దగ్గరికి వచ్చుడు కూడా వేస్ట్‌!" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తూ.. మీరెందుకు ఆయ‌న్ను అదుపులో పెట్ట‌టం లేదంటూ ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌యంలో ఆగ్ర‌హంతో ఉన్న స‌ర్వేను దానం ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఇదే స‌మ‌యంలో మ‌ల్లు ర‌వి ఆవేశంతో లేచి.. ఆయ‌న్ను ఫెలో అని ఎలా అంటారు?  మేం కూడా చ‌దువుకున్న వాళ్ల‌మే.. అడ్డ‌గోలుగా మాట్లాడ‌తారేంది? ద‌ళితులంటే అంత చిన్న‌చూపా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మ‌ల్లు ర‌విని ప‌క్క‌కు తీసుకెళ్లారు. అదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండ‌గా.. రాజ్ భ‌వ‌న్ లో త‌మ‌కు.. గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య న‌డిచిన సంవాదాన్ని కాంగ్రెస్ నేత‌లు వెల్ల‌డిస్తే.. ఇందుకు భిన్నంగా రాజ్ భ‌వ‌న్ స్పందించింది. కాంగ్రెస్ నేత‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ భేటీ స‌హృద్భావ వాతావ‌ర‌ణంలో జ‌రిగిన‌ట్లుగా పేర్కొంది. అలా కాకుండా పేప‌ర్ల‌లో మాదిరి ర‌చ్చ ర‌చ్చ‌గా జ‌రిగింద‌ని ఇవ్వ‌లేరు క‌దా?
Tags:    

Similar News