కేసీఆర్.. ‘మోసగాళ్లలో మొనగాడు మోసగాడు’?

Update: 2017-02-20 07:11 GMT
తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల దాడిని ఉధృతం చేశారు. రోజురోజుకీ బలపడిపోతున్న కేసీఆర్ ను దెబ్బ తీసే పనిలో భాగంగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్ని చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎప్పుడో ఒకసారి గళం విప్పే కాంగ్రెస్ నేతలు సైతం తమ విమర్శలకు పదును పెట్టారు. ఆచితూచి.. పెద్దరికంతో మాట్లాడే జానారెడ్డి లాంటి వారు సైతం మాటలతో విరుచుకు పడుతున్న వైనం చూస్తే.. కేసీఆర్ ను వ్యూహాత్మకం విమర్శలతో రౌండప్ చేసినట్లుగా కనిపించకమానదు.

బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని జానారెడ్డి మండిపడితే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి.. కేసీఆర్ మోసగాళ్లలోనే మొనగాడైన మోసగాడుగా అభివర్ణించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో విఫలమయ్యారన్న ఆయన.. తెలంగాణ ప్రజలు గుణవంతులని.. రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల పాటన కొత్త బిచ్చగాళ్ల రాజ్యంగా మారిందని కేసీఆర్ తో పాటు.. మోడీపైనా విరుచుకుపడ్డారు జైపాల్.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడి నాటి నుంచి వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నజానారెడ్డి.. ‘‘ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. పరిపాలనను పట్టించుకోవటం మానేశారు. ప్రశ్నించే వారిని ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ప్రజా సంఘాలు.. పార్టీ నేతల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అధికార అహంతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారు’’ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బంగారు తెలంగాణ అయితే.. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న సూటిప్రశ్నను ఉత్తమ్ కుమార్ రెడ్డి సంధించారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి.. కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ ముడుపులుతీసుకునేందుకు మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించారన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఉత్తమ్ వ్యాఖ్యానిస్తే.. మోసపూరిత మాటలతో ప్రజల్ని కేసీఆర్ మభ్యపెడుతున్నారని ఏఐసీసీ నేత ద్విగ్విజయ్ సింగ్ విమర్శించారు.

బీసీల సమైక్యతను దెబ్బతీసేందుకే కులవృత్తుల పేరుతో కేసీఆర్ గారడీ చేస్తున్నారని వీహెచ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టిన కాంగ్రెస్ నేతల్లో పొన్నాల లక్ష్మయ్య.. సుదర్శన్ రెడ్డి.. ప్రసాదరావు.. సురేశ్ రెడ్డి.. మధుయాష్కీ గౌడ్.. పొన్నం ప్రభాకర్.. సురేష్ షెట్కార్ ఇలా నేతలంతా కేసీఆర్ పై విరుచుకుపడటం చూస్తే.. అంతా కలిసి మాటలతో తెలంగాణ ముఖ్యమంత్రిని రౌండప్ చేసినట్లుగా కనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News