క‌రెంటు బాంబుకు విప‌క్షాలు విల‌విల‌!

Update: 2018-01-02 07:20 GMT
తానేం చేసినా గురి చూసి కొట్టిన‌ట్లుగా కొట్ట‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అల‌వాటు. ప‌క్కా ప్లానింగ్ తో టైం చూసుకొని మ‌రీ పావులు క‌ద‌ప‌టం కేసీఆర్ బ‌లం. ఆయ‌న‌లాంటి బ‌ల‌మైన నాయ‌కుడ్ని ఢీ కొన‌టం అంటే.. ఒక‌రిద్ద‌రి వ‌ల్ల ఎంత మాత్రం కాదు. ప్ర‌జాక‌ర్ష‌ణ పుష్క‌లంగా ఉన్న స‌రిపోదు. ఒక‌ట్రెండు మెద‌ళ్లు స‌రిపోవు. స‌మిష్టిగా ప‌ని చేస్తే త‌ప్పించి వ‌ర్క్ వుట్ కాదు.

కేసీఆర్ ను ఢీ కొనాల‌న్న ఉత్సాహం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో బ‌లంగా క‌నిపిస్తుంటుంది. ఆ మాత్రం స‌మ‌రోత్సాహం లేక‌పోతే బాగోదు. కానీ.. అది స‌రిపోతుందా? అంటే.. క‌చ్ఛితంగా కాద‌నే చెప్పాలి. కేసీఆర్ ను త‌ప్పు ప‌ట్టాల‌న్నా.. త‌ప్పును వేలెత్తి చూపించాల‌న్న ఒక‌రిద్ద‌రి వ‌ల్ల కానే కాదు. ఒక‌వేళ కేసీఆర్ స్థానంలో మ‌రొక‌రు ఉంటే.. అదేమంత పెద్ద విష‌యం కాదు. కానీ.. చుట్టూ ఉన్న ప‌రిస్థితుల్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంతో పాటు.. అధికార‌ప‌క్షానికి అస‌లుసిస‌లు విప‌క్షం తామేన‌ని చెప్పుకునే మీడియాను సైతం త‌న‌కు బాకా ఊదేలా చేసుకున్న కేసీఆర్ లాంటి అధినేత‌తో పోరు అంటే మాట‌లు కాదు.

అసాధ్యమ‌ని అంద‌రూ అనుకునే అంశాన్ని వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ అంశంగా తీసుకొని..  అనుకున్న‌ట్లే సాధించే దిశ‌గా అడుగులు వేశారు కేసీఆర్‌. రైతుల‌కు 24గంట‌ల‌పాటు వ్య‌వ‌సాయ విద్యుత్ ను నిరంత‌రంగా.. నాణ్య‌త‌తో ఉచితంగా అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసి.. కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా ప్ర‌క‌టించిన కేసీఆర్ స‌ర్కారు వ‌రాన్ని విమ‌ర్శించటం అంత తేలికైన విష‌యం కాదు.

ఏదో మాట్లాడామంటే మాట్లాడ‌మ‌న్న‌ట్లుగా మాట్లాడితే స‌రిపోదు. దీని వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు అస్స‌లు గుర్తించ‌టం లేదు. మొన్న‌టివ‌ర‌కూ ఉచిత విద్యుత్ ను నిరంత‌రం అందించాల‌ని.. రైతుల క‌ష్టాల్ని తీర్చాల‌ని డిమాండ్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు అందుకు భిన్న‌మైన స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

ఓప‌క్క 24 గంట‌లూ ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి ప్ర‌చారం చేస్తుంటే.. ఇంకోప‌క్క తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. అన్నేసి గంట‌లు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదంటూ తొమ్మిది గంట‌లు చాలు.. ప‌న్నెండు గంట‌లు విద్యుత్ చాలు అంటూ చెప్ప‌టం చూస్తే.. విద్యుత్ విష‌యంలో కేసీఆర్ మీద ఎలా ఎదురుదాడి చేయాలా? అన్న విష‌యంపై ఏ మాత్రం అవ‌గాహ‌న లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

కేసీఆర్ ఎత్తులు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వారు సైలెంట్ గా ఉండ‌టం దీనికి నిద‌ర్శ‌నం. రేవంత్ కు భిన్నంగా.. జీవ‌న్ రెడ్డి.. కోమ‌టిరెడ్డి.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్లుగా మాట్లాడుతూ కొత్త గంద‌ర‌గోళాన్ని తెర మీద‌కు తెస్తున్నారు. 24 గంట‌లూ ఉచిత విద్యుత్ అని కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ప్పుడు.. దానికి ధీటుగా మాట్లాడ‌ల‌న్నా.. దాన్ని త‌ప్పు ప‌ట్టాల‌న్నా తొంద‌ర‌ప‌డ‌టానికి మించిన పెద్ద త‌ప్పు ఉండ‌దు.

అయితే.. అలాంటిదేమీ లేకుండా.. వెనుకా ముందు చూసుకోకుండా కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు చూస్తుంటే.. ఎలాంటి క‌స‌ర‌త్తు లేకుండా మాట్లాడుతున్నార‌నిపించ‌క మాన‌దు. అంతేకాదు.. వారి విమ‌ర్శ‌లు కేసీఆర్ త‌మ‌ను మ‌రీ ఇంత భారీగా దెబ్బేస్తారా? అన్న‌ట్లుగా హాహాకారాలు చేసిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి చూస్తుంటే.. కేసీఆర్ వేసిన విద్యుత్ బాంబు వారిని అయోమ‌యానికి గురి చేయ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్ ప‌ట్ల భ‌యాన్ని క‌లిగించింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

Tags:    

Similar News