కాంగ్రెస్ తాంబూలాలిచ్చాం..తన్నుకుచావండి

Update: 2018-11-12 04:28 GMT
కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా 26 రోజులే.. ఏం చేసినా ఈ 26 రోజులే.. అందులో పగలు ఉండేది 13 రోజులే.. ఈ పదమూడు రోజుల్లోనే కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల ముఖాలు జనాలు తెలియాలి. ప్రతి పల్లె - పట్టణంలో ఫలానా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని జనాలకు పరిచయం కావాలి.. ఇంత తక్కువ వ్యవధిలో అంతటి ప్రచారం జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.

ఇక గులాబీ దండు మాత్రం ఇప్పటికే రెండు మూడు సార్లు గ్రామాలు - పట్టణాలు చుట్టేసింది. టీఆర్ ఎస్ లో తాకిడి ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది. అసలు కాంగ్రెస్ లీడర్ ఎవరో తెలియక ప్రచారం అంతా చప్పగా సాగుతోంది.

గులాబీ దళపతి మాత్రం జోరుమీదున్నాడు. అసెంబ్లీ రద్దు చేయగానే 105మందిని ప్రకటించేశారు. అందులో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నవాళ్లున్నారు. కానీ కేసీఆర్ ను చూసి ఓటేస్తారని.. తన పథకాలే కారును గెలిపిస్తాయని ఆయన ముందుకెళ్లారు. కొంత వ్యతిరేకత వచ్చినా గులాబీ ప్రచారం ముందు అస్సలు మొదలుపెట్టని కాంగ్రెస్ ఎంత మేరకు జనాలను ఆకట్టుకుంటుందన్నది అంతుచిక్కడం లేదు.

నేటి నుంచి నామినేషన్లు వేసేయాలి. కేసీఆర్ తన 106 మంది అభ్యర్థులకు బీఫారాలు కూడా పంచేశారు. వారు అంగరంగ వైభవంగా ర్యాలీలతో నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. అంతేకాదు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ - గద్వాల అరుణ - కొడంగల్ రేవంత్ రెడ్డి - మక్తల్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు అప్పగించేశాడు కేసీఆర్. ఇక కీలకమైన నియోజకవర్గాలకు కూడా ఇన్ చార్జిలను నియమించారు.

ఇలా కేసీఆర్ ఎన్నికలు జరిగే 26 రోజుల్లో గులాబీ దళాన్ని - కార్యచరణను ప్రకటించి ముందుకెళుతున్నాడు.కానీ కాంగ్రెస్ ఇంకా మహాకూటమి సీట్ల సర్దుబాటు చేయలేదు. ఈరోజు ప్రకటిస్తానంటోంది. ఇప్పటికే సీట్లు దక్కని వారు గాంధీ భవన్ ముట్టడించి రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రైవేటు బౌన్సర్లను పెట్టి మరీ కాపాలా కాయాల్సిన పరిస్థితి. ఎక్కడ సీట్లు ప్రకటిస్తే అసమ్మతి - రెబల్స్ వస్తుందని భావించి కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంభిస్తోంది. నామినేషన్ వేళ ప్రకటించేసి చేతులు దులుపుకుంటే.. ‘తాంబూలాలిచ్చాం ఇక తన్నుకుచచ్చినా’ ప్రయోజనం లేదనే వ్యూహాన్ని కాంగ్రెస్ అవలంభిస్తోంది. కూటమి సభ్యులైన టీడీపీ - టీజేఎస్ - సీపీఐలు కూడా ఎంతో కొంత నష్టపోవాల్సిందే.. నామినేషన్ ముగిశాక ఎంత అరిచి గీపెట్టినా కాంగ్రెస్ రెబల్స్ చేసేది ఏమీ లేదు. అందుకే నాన్చి నాన్చి కాంగ్రెస్ వాయిదాలేస్తోంది. ఈరోజు ప్రకటిస్తే గాంధీ భవన్ వద్ద 141 సెక్షన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. చూడాలి మరి  ఏం జరుగుతుందో..
Tags:    

Similar News