టీ కాంగ్రెస్ - హైదారాబాదులో ఫెయిల్‌!

Update: 2018-07-06 17:30 GMT
ఒక‌వైపు ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న గ‌డువు... మ‌రోవైపు ముంద‌స్తు ఘంటికలు మోగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా త‌న గ్రాఫ్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నిక‌ల్లో విక్టరీ కొట్టి.. కేసీఆర్‌ కు గ‌ట్టి ఝల‌క్ ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానికి అనుగుణంగానే ప్ర‌ణాళికలు వేసుకుంటోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బ‌స్సు యాత్రల‌తో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడ‌ర్‌లో జోరు పెంచారు. అంతేకాదు అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా దూకుడు పెంచుతూ పోతున్న ఉత్త‌మ్‌ కు అనూహ్య స‌వాల్ ఎదుర‌వుతోంది. అది కూడా రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా జోరు పెరిగినా.. పార్టీకి గుండెకాయ వంటి హైద‌రాబాద్‌ లో పార్టీకి క్రేజ్ రాక‌పోవ‌డం పీసీసీ నాయకుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ్రేట‌ర్‌ లో పార్టీ ఇంత‌లా డీలా పడ‌టానికి న‌గ‌రంలోని పెద్ద నేత‌ల వ్యవహర శైలి ఓ కార‌ణ‌మని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. దానం నాగేంద‌ర్ తాను కారెక్కే దాకా.. పార్టీని కన్ఫ్యూజన్‌ లో పెట్టి.. పార్టీని కొలుకోలేని విధంగా డ్యామేజ్ చేశార‌న్న చ‌ర్చ ఉంది. ఇలా ప‌లు ర‌కాల కార‌ణాల‌తో గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల నుండి డీలాప‌డ్డ క్యాడ‌ర్‌ లో.. జోష్ పెంచి గాడిలో పెట్టేందుకు సీటి పార్టీ ప‌గ్గాల‌ను మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్‌ కు అప్పగించారు. అయినా పార్టీ కార్యక్రమాలలో జోష్ క‌నిపించ‌డం లేదు. అయితే అధ్యక్షుడిగా బాధ్యత‌లు తీసుకుని  రెండు నెల‌లు కావస్తున్నా... క‌మిటీలపై అడుగు ముందుకు ప‌డ‌టంలేదు. సిటీ అధ్యక్షుడిగా అంజ‌న్ కుమార్ క‌మిటీల‌ను వేయ‌కుండా న‌గ‌రంలోని సీనియ‌ర్స్ అడ్డుకుంటున్నార‌ంటూ ఓ వాదన వినిపిస్తోంది.

దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలోని చిత్ర‌మైన ప‌రిణామాలు క్యాడ‌ర్‌ ను అయోమ‌యానికి గురిచేస్తున్నాయ‌న్న టాక్ ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పేరుకు  పార్టీలో ఉన్నార‌న్నదే కానీ.. ఆయ‌న ఇప్పటి  వ‌ర‌కు ఏ ఒక్కపార్టీ కార్యక్రమంలో పాల్గొన‌డం లేదు. క‌నీసం గాంధీభ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌టంలేదు. దీనికి తోడు రేపో మాపో ముఖేష్ కూడా గులాబి గూటికి చేరుతార‌న్న చ‌ర్చ కూడా సిటి క్యాడ‌ర్‌ను అయోమ‌యానికి గురి చేస్తోంది. ఇక మ‌రో మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మాత్రం అడ‌పాద‌డ‌పా పార్టీ కార్యక్రమాల‌కు హ‌జ‌రవుతున్నారు. ఇదే బాటలో మాజీ హోంమంత్రి - స‌బితా ఇంద్రారెడ్డి - కార్తిక్ రెడ్డిలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మై కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధన్ రెడ్డి పార్టీలో ఉన్నారా అన్న సందేహం క‌లుగుతోంది.  ఇక మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి - శ్రీశైలం గౌడ్ - బిక్షప‌తి యాద‌వ్ - కేఎల్ ఆర్ పార్టీ కార్యక్రమాల్లో మెరుపులా మెర‌వ‌డం.. అ త‌ర్వాత గ‌యాబ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా గ్రేట‌ర్‌ లో కాంగ్రెస్ క్యాడ‌ర్ ను డీలా ప‌డేలా చేశాయ‌ని సీనియర్ నాయకులు అంటున్నారు. పార్టీ తెలంగాణ ర‌థ‌సార‌థి ఉత్తమ్‌ కు గ్రేట‌ర్ ఇలా బీపీ పెంచేస్తుందా?  లేదా రాబోయే కాలంలో త‌న ప‌నితీరును మెరుగుప‌ర్చుకుంటుందా అనేది వేచిచూడాల్సింది.
Tags:    

Similar News