తెలంగాణలో 'స‌హ‌కారం' వాయిదా!

Update: 2019-02-03 09:21 GMT
తెలంగాణ‌లో స‌హ‌కార సంఘాల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టం దాదాపుగా ఖాయ‌మైంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తొలుత భావించారు. అయితే - లోక్ స‌భ ఎన్నిక‌లు ముంచుకొస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌కార సంఘాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌ప‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న‌ ప్ర‌భుత్వం వాటిని వాయిదే వేసేందుకు సిద్ధ‌మైంది.

తెలంగాణ‌లో స‌హ‌కార సంఘాల పాల‌క వ‌ర్గాల ప‌ద‌వీకాలం గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలోనే ముగిసింది. అయితే - ప్ర‌భుత్వం వెంట‌నే తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. పాత పాల‌క వ‌ర్గాల ప‌ద‌వీ కాలాన్ని రెండు సార్లు ఆర్నెళ్ల చొప్పున పొడిగించింది. ఇలా పొడిగించిన ప‌ద‌వీ కాలం ఈ నెల‌తో ముగియ‌నుంది. ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టికీ వాటికి ఎన్నిక‌లు జ‌రిపేందుకు సిద్ధంగా లేన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంద‌స్తుగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆపై ఇటీవ‌లే పంచాయ‌తీ ఎన్నిక‌లు కూడా ముగిశాయి. ఇక లోక్ స‌భ ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న‌వాయి. వాటికి మ‌రో మూడు నెల‌లు కూడా గ‌డువు లేదు. ఈ ప‌రిస్థితుల్లో స‌హ‌కార ఎన్నిక‌ల‌తో బిజీ అవ్వ‌డం మంచిది కాద‌ని.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పైనే దృష్టిపెట్టాల‌ని అధికార టీఆర్ ఎస్ నేత‌లు భావించారు. ఇదే విష‌యాన్ని పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి నివేదించారు. దీంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల తర్వాతే స‌హ‌కార ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘాల‌కు మ‌రో ఆరు నెల‌ల‌పాటు పాత పాల‌క వ‌ర్గాల‌నే ప‌ర్స‌న్ ఇన్ ఛార్జి క‌మిటీలుగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదే స‌మ‌యంలో స‌హ‌కార సంఘాల ఎన్నిక‌ల‌నిర్వ‌హ‌ణ‌-విధివిధానాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 905 ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘాల ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. మ‌రోవైపు - ప్ర‌భుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నిక‌లు జ‌రిపేందుకు తాము సిద్ధ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News