రైతు ఆత్మ‌హ‌త్య‌లు...టీ స‌ర్కారు ఇలా చెప్తోంది

Update: 2015-09-29 06:57 GMT
తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై హాట్‌ గా చ‌ర్చ ప్రారంభ‌మైంది. శాసనసభలో రైతు ఆత్మహత్యలు - సమస్యలపై ఆ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చర్చకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.."మొదటగా రైతు సమస్యలపై చర్చించుకుందాం. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దానికనుగుణంగానే రైతు సమస్యలపై చర్చ ప్రారంభించాం. నిందారోపణలు అనవసరం. వివరణాత్మకమైన చర్చ అవసరం. అన్ని సమస్యల మీద మాట్లాడుకుందాం. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. ఉత్తమమైన సలహాలు - సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం"అని సీఎం కేసీఆర్ తెలిపారు. అనంత‌రం మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరమని అన్నారు. వరుసగా రెండేళ్ల అనావృష్టితోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 66 శాతం వర్షపాతం లోటు ఉందని, విత్తనాలు వేశాక వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయినప్పటికీ 80 శాతం పంటలు సాగు అయ్యాయని అన్నారు. కరీంనగర్ - నల్లగొండ జిల్లాలో 50 శాతం, మహబూబ్‌ నగర్‌ లో 100 శాతం పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.

అయితే రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత జానారెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పాపం టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నెత్తిన పెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజల బాధనే తాము సభ ముందుకు తెస్తున్నామని దానికే త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆత్మహత్యలపై చర్చిస్తామని చెప్పి అజెండాలో వేరే అంశాన్ని చేర్చారని విమర్శించారు. మరో వైపు రాష్ట్ర మంత్రులు సభలో తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంత‌రం కాంగ్రెస్ స‌భాప‌క్ష ఉప‌నేత‌ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రం ఏర్పడ్డాక సమాజంలో అందరి సమస్యలు గట్టెక్కుతాయనే ఆశాభావం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌న్నారు.  రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నా పరిస్థితి మెరుగ్గా లేద‌న్నారు. ప్రభుత్వం విడతలవారీగా రుణమాఫీని అమలుచేస్తోంద‌ని...తద్వారా రైతులకు బ్యాంకుల్లో రుణం లభించటం లేదని అన్నారు. అందుకే ఒకేసారి మాఫీ చేయాల‌ని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు మొలక దశ నుంచే దెబ్బతిన్నాయని, పెట్టుబడులు సమకూర్చుకోలేక రైతులు ఏళ్లు తరబడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో ఉన్న మంచి విధానాలను తీసుకుని ముందుకువెళ్లాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Tags:    

Similar News