రైతుల‌కు బేడీలు...తెలంగాణ స‌ర్కారుపై నిప్పులు

Update: 2017-05-11 17:05 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం అనూహ్య‌మైన చిక్కుల్లో ప‌డింది. ఖమ్మం మిర్చి యార్డును ధ్వంసం చేసిన ఘటనలో అరెస్టు చేసిన రైతుల‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువ‌చ్చారు. ఈ వార్త మీడియాలో ప్ర‌సారం కావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై ప‌లువురు మండిప‌డ్డారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన 10 మంది రైతులకు కండిషనల్‌ బెయిల్‌ మంజూరైంది. మ‌రోవైపు రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆఫ్‌ పొలీస్ ఇబ్బాల్ అన్నారు.

ఖమ్మం మిర్చియార్డు ఘటనలో అరెస్టయిన రైతులను కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో వారి చేతులకు బేడీలు వేసిన ఉదంతంపై పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఇద్దరు ఎఆర్‌ ఎస్సైలు వెంకటేశ్వరరావు, పున్నా నాయక్‌లను సస్పెండ్‌ చేసింది. ఈ ఉదంతంపై విచారణ కోసం డిసిపి సాయికృష్ణను విచారణాధికారిగా నియమించింది.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేసి జైలుకు పంపిన రైతులను పోలీసులు ఈ రోజు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రైతులకు సంకెళ్లు వేస్తారా? వారేమైనా ఉగ్రవాదులా అంటూ మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని రమణ హెచ్చ‌రించారు.
Tags:    

Similar News