డబ్బులిస్తామన్నా మరీ అంత కరుకా కేసీఆర్?

Update: 2015-09-09 04:20 GMT
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ఏదో ఒక వివాదం తలెత్తుతున్న తీరుతో.. విడిపోయి కలిసి ఉందామంటూ ఉద్యమ సమయంలో చెప్పిన స్ఫూర్తికి విరుద్ధగా వ్యవహారాలు సాగుతున్న పరిస్థితి. ఏపీకి సంబంధించిన చాలా విషయాల్లో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు అవకాశం కల్పించేలా ఉంది.

పోటీ పడటం.. మెరుగైన సౌకర్యాలు.. వసతులు కల్పించటం ద్వారా ముందు ఉండే కన్నా.. తనకున్న అధికారాన్ని ప్రదర్శించటానికే తెలంగాణ సర్కారు ప్రాధాన్యత ఇస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు శ్రీశైలం సమీపంలోని అక్కమహాదేవి వివాదాన్ని ప్రస్తావిస్తున్నారు.

విభజన నేపథ్యంలో శ్రీశైలం ఏపీ పరిధిలోకి రాగా.. ఈ పుణ్యక్షేత్రానికి సమీపంలోని అక్కమహాదేవి గుహలు తెలంగాణ రాష్ట్రం కిందకు వెళ్లిపోయాయి. దీంతో శ్రీశైలం నుంచి మోటార్ బోట్ లో కృష్ణా నది మీదుగా అక్కమహాదేవి గుహలకు వెళ్లే ఏపీ పర్యాటక శాఖ బోట్లను తెలంగాణ అధికారులు అనుమతి ఇవ్వటం లేదు. ఎందుకిలా అంటే.. శ్రీశైలం నుంచి అక్కమహాదేవి గుహలకు నడిపే బోట్లలో ఒక్కొ ప్రయాణికుడి దగ్గర నుంచి రూ.250 వసూలు చేస్తుంటారు. తమ ప్రాంతంలోకి వస్తున్నందున ప్రయాణికుల నుంచి వసూలు చేసే మొత్తంలో ఒక్కొక్కరిపై రూ.50 ఇవ్వాలని ఏపీ పర్యాటక శాఖను తెలంగాణ అటవీ శాఖ అడిగింది.

కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాల అనంతరం..తెలంగాణ అటవీ శాఖ అడిగిన విధంగా ఏపీ పర్యాటక శాఖ డబ్బులు ఇచ్చేందుకు ఓకే చెప్పి.. అనుమతి ఇవ్వాలని కోరింది. ఆసక్తికరంగా ఏపీ పర్యాటక శాఖ ఓకే చెప్పి ఒప్పందం కుదుర్చుకోవటానికి సిద్ధమని చెప్పినా.. తెలంగాణ అటవీ శాఖ మాత్రం అనుమతులు ఇవ్వకుండా ఉండటం గమనార్హం. శ్రీశైలం నుంచి వచ్చే భక్తుల్లో రోజూ సగటున వంద మంది వరకూ.. వారాంతంలో మరికాస్త ఎక్కువ మంది అక్కమహాదేవి గుహలకు వెళుతుంటారు. కానీ.. తెలంగాణ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆ గుహలకు వెళ్లే వారే కరువయ్యారు. మరోవైపు ఇలాంటి సౌకర్యం తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. దీంతో.. అమ్మవారి గుహల్ని చూడాలనుకునే భక్తులకు నిరాశే మిగులుతుంది.

నిజానికి వందమంది భక్తుల నుంచి తెలంగాణ అటవీశాఖ కోరుకున్నట్లుగా రూ.50 చొప్పున వచ్చే మొత్తం పెద్ద మొత్తమేమీ కాదు. కానీ.. విభజన ముందు వరకు భక్తులతో ఎంతో కొంత కళకళలాడే అక్కమహాదేవి గుహలు ఇప్పుడు భక్తుల ఊసు లేక వెలవెలబోతున్నాయి. చక్కగా సాగే విధానాన్ని ఏదో ఒక పంచాయితీ బయటకు తీసి పాడు పెట్టుకోవటం తెలంగాణ అధికారులకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదే అంశానికి సంబంధించి మరో వాదన ఏమిటంటే.. తెలంగాణ సర్కారు కూడా బోట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీశైలం బ్యాక్ బాటర్స్ ద్వారా అక్కమహాదేవి గుహలకు ప్యాకేజీ రూపొందించాలని ఆలోచిస్తుందని.. అందుకే ఏపీ బోట్లకు అనుమతి ఇవ్వటం లేదని చెబుతున్నారు. మెరుగైన సేవలన్నవి పోటీ ఉంటేనే తప్ప.. ఎవరో ఒకరే ఉంటే మెరుగైన సేవలు అందించే అవకాశం ఉండదు. తమకొచ్చే ఆదాయంలో తెలంగాణ అధికారులు కోరినంత వాటా ఇస్తానన్నా ఏపీ పర్యాటక శాఖకు అనుమతి ఎందుకు ఇవ్వరు? ఏపీ అంటే.. మరీ ఇంత కరుకా కేసీఆర్ అన్న ప్రశ్న వేయాలనిపించక మానదు.
Tags:    

Similar News