సెప్టెంబరు జీతాలపై మడత పేచీ పెట్టిన కేసీఆర్ సర్కార్

Update: 2019-11-27 10:45 GMT
తన మాట వినని ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కటువుగా ఉన్నారో చెప్పే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. 52 రోజుల పాటు సమ్మె చేసి.. నిన్నటి నుంచి డ్యూటీలోకి వస్తామని చెప్పినప్పటికీ వారిని విధుల్లోకి చేర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అనటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సమ్మెకు ముందు సెప్టెంబరులో పని చేసిన ఉద్యోగానికి సంబంధించిన జీతాన్ని ఇచ్చే విషయంలో మొదట్నించి సుముఖంగా లేని కేసీఆర్ సర్కారు తాజాగా హైకోర్టు కొత్త తరహా వాదనను వినిపించింది.

ఈ వాదన విన్నంతనే మడతపేచీ అంటే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా ప్రభుత్వ విధానం ఉందంటున్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 7 ప్రకారం.. ఒక రోజు విధులకు హాజరుకాకుంటే 8 రోజులు జీతం కట్ చేయొచ్చని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు వాదించారు. కార్మికులు యాభై రెండు రోజలుగా సమ్మెలో ఉన్నారని.. కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబరు జీతాల్ని చెల్లించలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించటం షాకింగ్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తక్షణమే సెప్టెంబరు నెల జీతాలు చెల్లించేలా ఆర్టీసీకి.. ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించారు. అయితే.. ఈ అంశంపై రెండు పక్షాల మధ్య జోరుగా వాదనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను బుధవారం నాటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా పరిణామాలు చూస్తే.. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి రానున్న రోజుల్లో దారుణంగా మారే వీలుంది. దగ్గర దగ్గర రెండు నెలలుగా సమ్మె చేయటం.. సమ్మెకు ముందు పని చేసిన నెలకు సైతం జీతాలు ఇవ్వని నేపథ్యంలో కార్మికుల ఆర్థిక పరిస్థితి మహా ఇబ్బందిగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News