ధనిక రాష్ట్రంలో నెలకు 1800 కోట్ల లోటు

Update: 2015-11-22 07:19 GMT
ఖజానాపై భారం పెరిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి ఇస్తున్న హామీలకు, నిధులకు పొంతన లేకపోవడంతో ఎలా గట్టెక్కాలనే విషయమై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరో నెల, రెండు నెలల కాలంలో పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో ట్రెజరీ బిల్లులు ఖాళీ అయి ఓవర్‌ డ్రాఫ్టుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం అంచనాలు తప్పడం తాజా పరిస్థితులకు ఒక కారణంగా భావి స్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాటర్‌ గ్రిడ్‌ - ప్రాజెక్టులు - మిషన్‌ కాకతీయ - రుణమాఫీ - డబల్‌ బెడ్‌ రూం వంటి పథకాలకు భారీ గా నిధులు కేటాయించాల్సి రావడం కూడా ఖజానా ఖాళీ కావడానికి కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలకు సైతం ప్రభుత్వం పెద్దపీట వేయడం నిధుల కొరతకు కారణమని ఆర్ధిక శాఖ అధికారులే అంటున్నారు.

తెలంగాణలో నవంబర్‌ నెలలోనే ఇంతవరకు దాదాపు నాలుగున్నర వేల కోట్ల రూపాయలను వివిధ బిల్లుల నిమిత్తం చెల్లించారు. ఉద్యోగుల వేతనాలు - పెన్షన్ల కోసం దాదాపు 2500 కోట్ల దాకా చెల్లిస్తుండగా, మిగిలిన దాదాపు 1500 కోట్ల రూపాయలతోనే అరకొరగా నిధులను ఆర్ధిక శాఖ సర్దుబాటు చేసింది. అత్యవసరమైన బిల్లులను మాత్రమే చెల్లించాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఇతర అత్యవసరమైన బిల్లులను ఎలా సర్దుబాటు చేయాలనే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రతి నెలా తెలంగాణ రాష్ట్ర అవసరాల నిమిత్తం ప్రణాళిక - ప్రణాళికేతర వ్యయం కింద దాదాపు 7300 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా, అయితే రాబడులు మాత్రం దాదాపు 5500 కోట్లకు మించకపోవడంతో బిల్లుల చెల్లింపులలో జాప్యం జరుగుతోంది. పలు బిల్లుల విషయంలో ఆర్ధిక శాఖ పై ఒత్తిడి పెరిగిపోయింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఏటా రాష్ట్ర ఖజానాకు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా లోటు ఏర్పడటం అనివార్యంగా కనిపిస్తోంది. ప్రతి నెలా సుమారు 1800 కోట్ల రూపాయలకు పైగా లోటు వున్న నేపథ్యంలో ప్రస్తుత గండం నుంచి గట్టెక్కాలనే దిశగా ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది.
Tags:    

Similar News