రేవంతూ!... టైం బ్యాడ్ అంటే ఇదేన‌బ్బా!

Update: 2019-02-27 09:08 GMT
నిజ‌మే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుతానంటూ రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏ ఒక్క‌టీ క‌లిసి రావ‌డం లేదు. టీడీపీలో ఉండ‌గా... ఎప్పుడైతే ఓటు నోటు కేసులో ఇరుక్కున్నారో... నాటి నుంచే రేవంత్ ప‌రిస్థితి ఒక్క‌సారిగా తిరోగ‌మ‌నంలో ప‌య‌నించ‌డం ప్రారంభ‌మైంద‌ని చెప్పాలి. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పోలింగ్‌ కు కాస్తంత ముందుగా పోలీసులు రేవంత్‌ ను అరెస్ట్ చేసిన తీరు నిజంగానే దారుణ‌మ‌ని చెప్పాలి. అర్ధ‌రాత్రి రేవంత్ నిద్రిస్తున్న బెడ్ రూంలోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ పోలీసులు... రేవంత్ ను మెడ ప‌ట్టి మ‌రీ పోలీస్ జీపెక్కించారు. ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే... అదంతేనంటూ పోలీసుల నుంచి స‌మాధానం వ‌చ్చింది. ఈ దెబ్బ‌తో రేవంత్‌ పై సానుభూతి బాగానే ప‌నిచేస్తుంద‌ని, ఆయ‌న గెలుపు తథ్య‌మ‌న్న విశ్లేష‌ణ‌ల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ... కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి... రేవంత్ ను చిత్తుచిత్తుగా ఓడించేశారు. వెర‌సి త‌న‌కు కంచుకోట‌గా చెప్పుకున్ కోడంగ‌ల్ లోనే రేవంత్ కు భారీ ఓట‌మి త‌ప్ప‌లేదు.

స‌రే ఎలాగూ ఓడిపోయాం క‌దా... ఇక కోర్టుల్లోనైనా త‌న‌ను ఓడించిన కేసీఆర్ ప‌రువు తీద్దామ‌న్న రేవంత్ క‌ల కూడా క‌ల‌గానే మిగిలిపోయింద‌నే చెప్పాలి. కాసేప‌టి క్రితం ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల్లో అల‌జ‌డి రేగుతుంద‌ని భావిస్తే... ఎంత‌టి నేత‌నైనా అరెస్ట్ చేసే అధికారాలు ఎన్నిక‌ల సంఘానికి ఉంటాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాకుండా కోర్టును రేవంత్ ఆశ్ర‌యించిన తీరును కూడా త‌ప్పుబ‌ట్టిన ధ‌ర్మాస‌నం... రేవంత్ త‌ర‌ఫు న్యాయ‌వాదిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. మొత్తంగా అటు ఎన్నిక‌ల్లో ఓడిపోయి, ఇటు న్యాయ‌స్థానాల్లో నానా చీవాట్లు తింటున్న రేవంత్ కు ఇప్పుడు టైం అస్స‌లు బాగోలేద‌నే చెప్పాలి. రేవంత్‌ ను అరెస్ట్ చేసిన తీరును నిర‌సిస్తూ... రేవంత్ స‌న్నిహితుడు కాంగ్రెస్ పార్టీ నేత వేం న‌రేంద‌ర్ రెడ్డి హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. అయితే ఈ పిటిష‌న్ ను దాఖ‌లు చేసే అవ‌కాశం బాధితుడి కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని, స్నేహితుల‌కు ఉండ‌ద‌ని చెప్పిన హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

అస‌లు రేవంత్‌ కు సంబంధించి హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ ను మీరెందుకు దాఖ‌లు చేశారంటూ హైకోర్టు వేం న‌రేంద‌ర్ రెడ్డిని ప్ర‌శ్నించి షాకిచ్చింద‌నే చెప్పాలి. రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గా, తాను పిటిష‌న్ వేశాన‌ని ఆయ‌న చెప్ప‌గా... రేవంత్ స‌తీమ‌ణి ఏమైనా పొలిటీషియ‌నా? అంటూ మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను సంధించింది. ఇక చివ‌ర‌కు రేవంత్ స‌తీమ‌ణి ఎక్క‌డ ఉన్నారన్న విష‌యాన్ని చెప్ప‌బోతే... ఆమె ఉంటున్న ప్రాంతం హైద‌రాబాద్ కు ఎంత దూరమో చెప్పాలంటూ మ‌రో క్విక్ క్వ‌శ్చ‌న్‌ ను సంధించిన హైకోర్టు... రేవంత్ అండ్ కోకు షాకిచ్చింద‌నే చెప్పాలి. మొత్తంగా ప్ర‌శాంతంగా ముగియాల్సిన ఎన్నిక‌ల క్ర‌తువును రేవంత్ ఉద్రిక్తం చేసే దిశ‌గానే క‌దిలార‌న్న భావ‌న‌కు వ‌చ్చిన నేప‌థ్యంలోనే కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రేవంత్ కు ఇప్పుడు ఏ అక్క‌టీ అనుకూలంగా లేవ‌నే చెప్పాలి. మ‌రి ఈ విష‌యాన్ని రేవంత్ ఎప్పుడు గ్ర‌హిస్తారో చూడాలి.
Tags:    

Similar News