నాలుగోసారి కవితను విచారణకు పిలిస్తే జరిగేది ఇదేనట

Update: 2023-03-26 10:19 GMT
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి విచారణ పరీక్ష తప్పదా? ఇప్పటికే మూడుసార్లు విచారణనుఎదుర్కొన్న ఆమె.. నాలుగోసారి విచారణ సందర్భంగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే వీలుంది? మూడు దఫాలుగా ఈడీ విచారణకు హాజరైన ఆమె మొత్తం 27 గంటలకు పైనే ప్రశ్నల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే హాజరైన మూడు విచారణలతో పోలిస్తే.. నాలుగో విచారణ మాత్రం మరింత కష్టంగా.. క్లిష్టంగా.. ఇబ్బందికరంగా ఉండే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటివరకు ఎదుర్కొన్న మూడు విచారణల సందర్భంగా కవిత ఎదుర్కొన్న కీలక ప్రశ్నల క్రమాన్ని పరిశీలిస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఏం జరగనుంది? అన్న విషయంపై క్లారిటీ ఖాయమంటున్నారు.

మొదటి దఫా విచారణలో ఎదుర్కొన్న కీలక ప్రశ్నలు ఇవే

-  లిక్కర్ పాలసీ విధానంలో పాత్ర ఏమిటి?

- అసలు మీరెందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు?

-  ప్రత్యేక ఫ్లైట్‌‌ను ఎవరు ఏర్పాటు చేశారు?

-  ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారు?

-  అసలు కోట్లాది రూపాయిలు మీకు ఎలా వచ్చాయి?

-  అంత డబ్బు ఎవరి దగ్గర్నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇచ్చారు?

(ఈ విచారణ సందర్భంగానే కవిత ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు)

రెండోసారి విచారణలో ఎదుర్కొన్న కీలక ప్రశ్నలు ఏమంటే?

-  రామచంద్ర అరుణ్ రామచంద్ర పిళ్లై ఎవరు?

-  గోరంట్ల బుచ్చిబాబు ఎవరు? ఎలా పరిచయం?

-  పిళ్లైతోనూ.. బుచ్చిబాబుతోనూ మీకున్న సంబంధాలు ఏమిటి?

-  ఈ ఇద్దరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న పాత్రేంటి?

-  మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?

-  ఆయనకు ఎంత మొత్తాన్ని ముట్టజెప్పారు? ఇందులోని ఇతర సూత్రదారులు..పాత్రదారులెవరు?

మూడోసారి ఎదుర్కొన్న కీలక ప్రశ్నలు ఇవేనట

-  మూడోసారి విచారణకు హాజరైన వేళలో.. ప్రశ్నలు దాదాపుగా ఫోన్ల చుట్టూనే తిరిగాయి. ఆమె వాడిన ఫోన్లను తీసుకు వచ్చిన నేపథ్యంలో.. వాటికి సంబంధించిన ప్రశ్నల్ని సంధించారు. ఈ సందర్భంగా చెప్పిన మాటల్ని రికార్డు చేసుకొని.. వాటిని తమ వద్ద ఉన్న ఆధారాలతో క్రాస్ చెకింగ్ జరుగుతుంది. ఈడీ అడిగిన ఫోన్లను ప్యాక్ చేసి సీల్డ్ కవర్ లో ఈడీకి అందజేశారు.

నాలుగోసారి విచారణకు పిలిస్తే ఏ విధమైన ప్రశ్నలు ఎదురవుతాయి? అన్న దానిపై ఇప్పటికే ఒక అంచనా వినిపిస్తోంది. అదేమంటే..

-  ఈసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిస్తే మాత్రం.. కవితకు కష్టాలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈసారి విచారణ వేళలో.. ఇప్పటికే ఈ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటూ.. జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పిళ్లై.. బుచ్చిబాబులను ఎదురుగా కూర్చోబెట్టి ఎమ్మెల్సీ కవితకు ప్రశ్నలు సంధిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే వారి విచారణ పూర్తి అయిన నేపథ్యంలో.. విచారణ వేళ వారు అందించిన సమాచారాన్ని..కవిత వ్యాఖ్యలతో క్రాస్ చెక్ చేయనున్నారు. ఇక.. ఇప్పటికే తీసుకున్న ఫోన్లలో డేటా ఉందా? రికవరీ చేయాల్సి వస్తే.. అలా చేసిన తర్వాత వచ్చిన డేటాను అప్పటికే ఇచ్చిన సమాచారంతో క్రాస్ చెక్ చేయటం.. ఒకవేళ ఇచ్చిన సమాచారంలో మ్యాచ్ కాకుంటే.. చాలా త్వరగా నోటీసులు జారీ అయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Similar News