బీజేపీతో టచ్ లో 15 మంది ఎమ్మెల్యేలన్నారు.. నలుగురేనా? వారిలో వీరున్నారా?

Update: 2022-10-27 13:30 GMT
తెలంగాణను కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. దీనిపై గట్టిగా పోరాడాలని అటు అధికార టీఆర్ఎస్.. ఇటు ప్రతిపక్ష బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక.. ప్రజాప్రతినిధుల బేరసారానికి పదును పెట్టిందని తెలిసిపోతోంది.

ఈ క్రమంలో అత్యధిక ఎమ్మ్లెల్యేలున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనే అందరి చూపూ నిలిచింది. కాంగ్రెస్ కు మిగిలిన నలుగురైదుగురు శాసన సభ్యులను ఎలాగూ టీఆర్ఎస్ కదిలించలేదు. బీజేపీలోని ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పీడీ యాక్టుపై జైల్లో ఉంటే.. మిగతా ఇద్దరు తాము గెంటేసినవారే.

నిజంగా అన్నారా? కేవలం ఊహనా..?

తెలంగాణ రాజకీయాల్లో గత వారం రోజులుగా పలు సంచలన చేరికలు జరిగాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ల చేరిక. ఈ ఇద్దరి రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ నుంచే మొదలైంది. శ్రవణ్ పీఆర్పీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లగా.. ఉద్యోగ- ఉద్యమ సంఘ నేత స్వామి గౌడ్ అనూహ్యంగా గతేడాది కమలం పక్షాన చేరారు. అయితే, స్వల్ప కాలంలోనే వీరిద్దరూ సొంత గూటికి రావడం.. అది కూడా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ-టీఆర్ఎస్ హోరాహోరీగా పోరాటం సాగిస్తున్న తరుణంలో జరగడం గమనార్హం.

ఈ పరిణామం బీజేపీని ఆత్మ రక్షణలో పడేసింది. తెలంగాణలో ఆ పార్టీదంతా వాపే కానీ, బలుపు కాదనే సంకేతం వెళ్లినట్లయింది. మరోవైపు బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్ దూకుడుగా ఉందనే సంకేతమూ వెళ్లింది. దీంతో ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బీజేపీ వర్గాలు.. త్వరలో టీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ఊహాగానాలు వ్యాపింపజేశారు.

ఆత్మరక్షణలో అన్నమాటలా?

అధికార టీఆర్ఎస్ లో చాలామంది ఎమ్మెల్యేలు ఉక్కబోతను ఎదుర్కొంటున్నది వాస్తవమే అయినా.. 15 మంది ఒక్కసారిగా బీజేపీలోకి వస్తారని చెప్పడం కష్టమే. ఈ వ్యాఖ్యలు కేవలం తాము వెనుకంజలో లేమని చెప్పేందుకే అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. మరోవైపు బీజేపీని నమ్మి అంత పెద్ద సంఖ్యలో శాసన సభ్యులు వస్తారా? అంటే అదీ చెప్పలేం. దీన్నిబట్టే కేవలం ఆత్మరక్షణ కోసం బీజేపీ వర్గాలు చేసిన వ్యాఖ్యగా తెలిసిపోతోంది.

ఒకవేళ ఆ 15 మందిలో ఈ నలుగురున్నారా?

ఫాంహౌస్ కేంద్రంగా సాగిన బేరసారాలను ఊహలో పెట్టుకునే ఒకవేళ 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్పాయా? ఆ 15 మందిలో ఈ నలుగురు కూడా ఉన్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొంటూ ఇన్నాళ్లూ టీఆర్ఎస్ రాజకీయాలు చేయగా.. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందన్న ఫీలర్ ను టీఆర్ఎస్ వర్గాలు వ్యాపింపజేశాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News