ఇట‌లీలో తెలుగు టెకీ అనుమానాస్ప‌ద మృతి

Update: 2018-01-12 06:32 GMT
ఇటలీలో తెలుగు టెకీ అనుమానాస్ప‌ద‌ స్థితిలో మృతి చెందారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఘణపురం మండలం మానాజీపేట్‌ గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ప్రొఫెషనల్‌ జయప్రకాశ్‌ ఇటలీలోని అప్రిలీయా పట్టణంలో గల ఐబీఎం సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడు ఆఫీసుకు వెళ్లలేదు. దీంతో, అతని సహచర ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా జయప్రకాశ్‌ గదిలో విగతజీవిగా కనిపించాడు. కాగా, జయప్రకాశ్‌ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విశ్వనాథం పెద్దకుమారుడు జయప్రకాశ్(42). మృతుడికి భార్య - ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగిందో తెలపాల్సిందిగా కోరుతూ సుష్మాస్వరాజ్‌ కు ట్విట్టర్‌ ద్వారా విన్నవించారు. మృతదేహాన్ని స్వస్థలానికి త్వరగా పంపేలా ఏర్పాట్లు చేయాలని అభ్యర్థించారు.

ఇదిలాఉండ‌గా... బ్రిటన్‌ లో ఓ ప్రవాస భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సిగరేట్లు అమ్మేందుకు నిరాకరించినందుకు అతన్ని కొంతమంది మైనర్లు హతమార్చారు. వివరాల్లోకి వెళ్లితే...విజయ్‌ పటేల్‌ (49) అనే ప్రవాస భారతీయుడు ఉత్తర లండన్‌ లో కొంతకాలం నివాసముంటూ చిరు వ్యాపారం చేస్తున్నాడు. గతనెల 30న కొంత మంది మైనర్లు అతని షాపుకు వచ్చారు. సిగరెట్లు అమ్మమని బెదిరించారు.

అయితే, లండన్‌ లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మైనర్లకు సిగరెట్ల అమ్మకంపై నిషేధం ఉండటంతో పటేల్‌ నిరాకరించారు. దీంతో, ఆగ్రహానికి గురైన మైనర్లు పటేల్‌ పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పటేల్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తలకు బలమైన గాయం కారణంగా పటేల్‌ మృతి చెందినట్టు స్థానిక సెయింట్‌ మేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ముగ్గురు మైనర్‌ నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్టు స్కాట్‌ లాండ్‌ యార్డ్‌ పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News