ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతోందా ?

Update: 2021-10-02 07:33 GMT
ఘోరంగా ఓడిపోయి రెండున్నరేళ్ళలవుతున్నా ఓటమిని తెలుగుదేశంపార్టీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా తెలుగుమహిళ రాష్ట్రకమిటి ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డికి సీఎం స్ధాయి లేదన్నారు. జగన్ను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేకపోతున్నట్లు తెగ బాధపడిపోయారు. అచ్చెన్న తాజా వ్యాఖ్యల ద్వారా ఏమి తేలుతోందంటే 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో ఎదురైన ఘోర ఓటమిబాధ నుండి చంద్రబాబునాయుడు అండ్ కో ఇంకా బయటపడలేదని.

టీడీపీ నేతల మాటలు ఎలాగున్నాయంటే తెలుగుదేశంపార్టీ ఉన్నంతకాలం తమ పార్టీయే అధికారంలో ఉండాలని కోరుకుంటున్న విషయం అర్ధమవుతోంది. చంద్రబాబు తర్వాత లోకేష్ ఆ తర్వాత దేవాన్ష్ ఇలా వీళ్ళు మాత్రమే సీఎంగా ఉండాలి కానీ ఇంకోపార్టీ అధికారంలోకి రాకూడదనే బలమైన రాజరిక మనస్తత్వంలో కూరుకుపోయారు. వీళ్ళని కాదని మరొకళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇక వాళ్ళపై ఎంత బురదచల్లాలో అంతా చల్లేస్తు వాళ్ళని గబ్బు పట్టించేందుకు ప్రయత్నిస్తునే ఉంటారు.

లేకపోతే జగన్ను సీఎంగా చంద్రబాబో, అచ్చెన్నో లేకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించకపోతే ఏమిటి నష్టం ? ఎవరికి నష్టం ? మెజారిటి ప్రజలు ఓట్లేసి గెలిపించి జగన్ను సీఎంను చేశారు. కాబట్టి వీళ్ళకు ఇష్టమున్నా లేకపోయినా ఏపీ సీఎం ఎవరంటే ఎవరైనా జగన్ పేరే చెబుతారు కానీ చంద్రబాబు పేరో లేకపోతే ఇంకో పేరో చెప్పరు కదా? ఇంతోటిదానికి జగన్ కు సీఎం స్ధాయిలేదని, జగన్ను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేకపోతున్నామని అచ్చెన్న చెప్పటం విచిత్రంగా ఉంది.

నిజమైన ప్రతిపక్షమైతే ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు తెలీదా ? తాను గెలిచినపుడు ఒకలాగ ఓడిపోయినపుడు మరోలాగ వ్యవహరిస్తామంటు ప్రజాస్వామ్యంలో కుదరదు. ఎన్నికలు అయిపోయిన కొత్తల్లో కూడా జనాలను జగన్ మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క ఛాన్సంటు జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారంటు ఎంత గోలచేశారో అందరికీ తెలిసిందే.

టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తేనేమో జనాలు విజ్ఞతతో ఓట్లేసినట్లు. అదే ఓడగొడితే జనాలు తప్పుచేసినట్లు. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, అక్కసుతోనే రెండున్నరేళ్ళు టీడీపీ గడిపేసింది. నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఇప్పుడు కూడా జగన్ మీద పడి ఏడిస్తే ఏమిటి ఉపయోగమో అచ్చెన్నకే తెలియాలి. ప్రభుత్వంలో లోటుపాట్లను ఎత్తిచూపటాన్ని ఎవరు కాదనరు. అంతేకానీ జగన్ను సీఎంగా గుర్తించమని ఇంకా పాత రికార్డునే తిప్పుతున్నారంటేనే పాపం ఓటమి దెబ్బ ఏ స్ధాయిలో తగిలిందో అర్ధమైపోతోంది.
Tags:    

Similar News