ఆ మీడియా ఛానల్ మ‌ళ్లీ త‌ప్పు చేసింద‌ట‌

Update: 2018-03-13 05:34 GMT
ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేసే స‌మ‌యంలో ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారు. త‌ప్పులు దొర్ల‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతుంటారు. ఇందుకోసం సంస్థ‌లో అంత‌ర్గ‌తంగా ప‌లు వ్య‌వ‌స్థ‌లు ప‌ని చేస్తుంటాయి. కానీ.. త‌ప్పులు జ‌రిగిపోతుంటాయి. తాజాగా అలాంటి త‌ప్పులు ఆ మీడియా ఛానల్  ని ఇబ్బందికి గురి చేస్తుంది.

గ‌త వారంలో  పేపర్ క‌రీంన‌గ‌ర్ మినీ ఎడిష‌న్ లో దొర్లిన త‌ప్పుపై స‌ద‌రు మీడియా సంస్థ తీవ్ర‌విచారం వ్య‌క్తం చేసి.. చింతిస్తున్నామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌టం తెలిసిందే. హ‌రీశ్ రావు.. మ‌రో 40 మంది ఎమ్మెల్యేలు క‌లిసి  కాంగ్రెస్ లో చేరేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నానికి.. త‌మ‌దైన విశ్లేష‌ణ క‌లిపి అచ్చేశారు.

దీనిపై తెలంగాణ అధికార‌ప‌క్షంలో పెద్ద క‌ల‌క‌లం రేపింది. ఈ నేప‌థ్యంలో వివ‌ర‌ణ ఇచ్చిన స‌ద‌రు మీడియా సంస్థ‌.. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాన్ని అచ్చేశామే త‌ప్పించి.. అందులో ప్ర‌స్తావించిన అంశాలేవీ త‌మ అభిప్రాయాలు కాద‌ని స్ప‌ష్టం చేసింది. కొంత‌లో కొంత న‌యం ఏమిటంటే.. జ‌రిగిన త‌ప్పును మ‌సిపూసి మారేడు కాయ‌ను చేయ‌కుండా.. త‌ప్పు చేశాం.. సారీ అన్న మాట‌తో ఇష్యూ క్లోజ్ చేయ‌టం ప‌లువురు అభినందించారు. ప్ర‌ముఖ మీడియాలు చాలా సంద‌ర్భాల్లో త‌మ త‌ప్పుల‌ను ఇగోతో ఒప్పుకోకుండా కిందామీదా ప‌డే అవ‌స్థ‌ల‌తో పోలిస్తే.. ఈ ప్ర‌య‌త్నం మంచిద‌ని చెబుతారు.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి గాయ‌ప‌మైన దృశ్యాల‌కు సంబంధించి మీడియా సోద‌ర సంస్థ త‌ప్పు చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ కార‌ణంగా త‌ప్పు జ‌రిగింద‌ని స‌ద‌రు మీడియా సంస్థ ఓపెన్ గా ఒప్పేసుకుంది. ఇంత‌కీ స్వామిగౌడ్ ఎపిసోడ్ లో చోటు చేసుకున్న త‌ప్పు ఏమిటంటే.. స్వామిగౌడ్ కుడికంటికి గాయ‌మైంది. కానీ..ఎడ‌మ‌కంటికి గాయ‌మైన‌ట్లుగా విజువ‌ల్స్ ప్ర‌సార‌మ‌య్యాయి. దీనిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఎందుకిలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని విశ్లేషించిన మీడియా .. సాంకేతిక త‌ప్పిదం కార‌ణంగా అలా విజువ‌ల్ టెలికాస్ట్ అయ్యింద‌ని పేర్కొంది. వీడియో ఎడిటింగ్ లో మిర్ర‌ర్ ఎఫెక్ట్ వాడ‌టంతో కుడి కాస్తా ఎడ‌మైన‌ట్లుగా క‌నిపించింద‌ని.. వాస్త‌వానికి గాయం త‌గిలింది కుడి కంటికేన‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. త‌ప్పును గుర్తించిన వెంట‌నే త‌క్ష‌ణ‌మే స‌రిదిద్దామ‌ని.. సాంకేతిక త‌ప్పిద‌మే త‌ప్పించి.. కావాల‌ని చేయ‌లేదంటూ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది. వారం వ్య‌వ‌ధిలో రెండు కీల‌క‌మైన అంశాల‌కు సంబంధించి జ‌రిగిన త‌ప్పు ఆ సంస్థ‌ను ఇబ్బంది పెట్టాయ‌న్న మాట మీడియా స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.


Tags:    

Similar News