వెరీ గుడ్: ఎన్ ఆర్ ఐలు ఎంత మంచోళ్లంటే..!

Update: 2018-05-08 05:44 GMT
ఈ విష‌యాన్ని చెప్ప‌టానికి ముందు మీకో చిన్న ఉదాహ‌ర‌ణ చెప్పాలి. అతికిన‌ట్లుగా చాలామందికి అనిపించ‌దు కానీ.. త‌ర‌చి చూస్తే.. మేం చెప్పిన దాన్లో నిజం ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది. ఉమ్మ‌డి కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత‌కాపురం పెట్టుకున్నోళ్లు త‌మ ఆర్థిక స్థిర‌త్వం గురించి ఆలోచిస్తారే కానీ.. తాము అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఉమ్మ‌డి కుటుంబం గురించి ఆలోచించ‌టం క‌నిపించ‌దు. కానీ.. విదేశాల‌కు వెళ్లే భార‌తీయులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

వ‌దిలి వెళ్లిన మాతృదేశాన్ని.. అక్క‌డున్న త‌మ వాళ్ల గురించి వారెంత‌గా ఆలోచిస్తారో.. మ‌రెంత‌గా ఆరాట‌ప‌డ‌తారో అన్న విష‌యాన్ని చెప్పే అధ్య‌య‌నం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. విదేశాల‌కు వెళ్లే భార‌తీయులు ఎంజాయ్ చేస్తున్నార‌న్న ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. కానీ.. ఎంజాయ్ మెంట్ కంటే కూడా వారెంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. త‌మ కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఉమ్మ‌డి కుటుంబం నుంచి సొంత కుటుంబానికి వ‌చ్చిన‌ప్పుడు మిగిలిన వారి గురించి ప‌ట్ట‌న‌ట్లుగా ఉండే తీరు క‌నిపించినా.. విదేశాల‌కు వెళ్లే వారు మాత్రం అలా కాకుండా.. త‌మ కుటుంబాన్ని.. తాము వ‌దిలి వ‌చ్చిన ప్రాంతానికి ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విదేశాల‌కు వెళ్లే భార‌తీయులు అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత త‌మ కుటుంబాల‌కు.. బంధువుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ట‌మే కాదు.. వారికి ఆర్థికంగా చేయూత‌ను ఇచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తుంటార‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2017లో తాము సంపాదించిన సంపాద‌న‌లో భార‌త్‌ కు పంపిన సొమ్ము ఏకంగా రూ.4.6ల‌క్ష‌ల కోట్లుగా తేలింది.

అంత‌కు ముందు ఏడాదితో పోల్చిన‌ప్పుడు ఈ మొత్తం 9.9 శాతం ఎక్కువ‌ని చెబుతున్నారు. ఇదంతా ప్ర‌పంచ బ్యాంక్ చెప్పిన లెక్క‌గా చెబుతారు. ప్ర‌పంచంలో అన్ని దేశాల వారితో పోలిస్తే.. భార‌తీయులు మాత్ర‌మే త‌మ దేశానికి.. త‌మ వారికి పంపే మొత్తం అధికంగా ఉంటుంద‌ని తాజాగా వ‌ర‌ల్డ్ బ్యాంకు వెల్ల‌డించింది. భార‌తీయుల త‌ర్వాత త‌మ దేశానికి డ‌బ్బు పంపే దేశాలు చైనా.. ఫిలిప్పీన్స్.. మెక్సికో.. నైజీరియా.. ఈజిప్ట్ దేశాలు ఉన్న‌ట్లుగా పేర్కొంది.

బాధ్య‌త‌తో మెల‌గ‌టం భార‌తీయుల‌కు అల‌వాట‌ని.. అది వారి సంస్కృతిలో భాగంగా చెబుతారు. నిజానికి న‌గ‌దు బ‌దిలీ ఖ‌ర్చులు త‌గ్గితే.. మ‌రింత డ‌బ్బు వారి కుటుంబాల‌కు చేరుతుంద‌ని చెబుతున్నారు. దేశం కాని దేశం వెళ్లినా సొంత దేశం మీదా.. అయినోళ్ల ఆర్థిక అవ‌స‌రాల గురించి అదే ప‌నిగా ఆలోచించ‌టంలో మ‌న‌వాళ్ల గొప్ప‌త‌నం గ‌ర్వంగా అనిపించ‌క మాన‌దు. అయిన వాళ్ల అవ‌స‌రాల‌కు డ‌బ్బులు పంప‌ట‌మే కాదు.. పెట్టుబ‌డుల రూపంలోనే దేశానికే నిధులు పంపుతున్న వైనాన్ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ త‌న తాజా నివేదిక‌లో పేర్కొంది.
Tags:    

Similar News