షర్మిల ఆలోచన : వైఎస్సార్టీపీలో విజయమ్మకు ఆ హోదా...?

Update: 2022-07-25 14:57 GMT
వైఎస్సార్ ది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. అయితే ఆయన అధికారంలోకి వచ్చి అయిదుంపావు ఏళ్ళు మాత్రమే సీఎం గా పనిచేశారు. కానీ జీవితకాలానికి సరిపడా జనాలలో  గొప్ప పేరు తెచ్చుకున్నారు ఇక ఆయన బిడ్డలుగా జగన్, షర్మిల మొదట్లో వైసీపీ ద్వారా రాజకీయాలను కొనసాగించారు. అయితే వైసీపీ ఇపుడు పూర్తిగా  జగన్ సొంతం.

దాంతో షర్మిల తెలంగాణాలో వైఎస్సార్టీపీ పేరిట పార్టీ పెట్టుకున్నారు. ఇక తల్లిగా విజయ‌మ్మ రెండుగా విడిపోలేరుగా. అందుకే వైసీపీలో తన గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఆమె కుమార్తె షర్మిల పార్టీలో కీలకమైన పదవి చేపట్టి కీలకంగా మారుతారని అంతా భావించారు. అయితే లేటెస్ట్ గా షర్మిల మీడియాతో దీని మీద మాట్లాడుతూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

పార్టీలో పదవులు లేకపోయినా ఇన్నేళ్ళ పాటు నేను పనిచేశాను అంటూ వైసీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక విజయమ్మకు పదవి ఇవ్వడానికి ఆమెకు ప్రస్తుతం ఉన్న హోదా కంటే ఏదీ ఎక్కువ కాదు అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ సతీమణిగా విజయమ్మకు అత్యున్నతమైన హోదా ఉందని, దానికి సాటి రాగల పదవి తమ పార్టీలో తాను ఇవ్వలేనేమో అని షర్మిల అంటున్నారు.

ఇక పదవి లేకుండా తాను పనిచేస్తానని, వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని కోరుకున్న మనిషి విజయమ్మ అంటూ షర్మిల కొనియాడారు. అంటే విజయమ్మకు ఏ పదవీ లేకుండానే తన పార్టీలో ఆమెను ఉంచుతారా అన్న చర్చ వస్తోంది. మరి విజయమ్మను వైఎస్సార్ సతీమణిగానే జనంలో తిప్పుతారా అన్న మాట కూడా ఉందిపుడు.

మొత్తానికి విజయమ్మకు ఇపుడు ఈ వయసులో రాజకీయాలు అవసరం లేదు, ఆమె అవసరం మాత్రం బిడ్డలకు ఉంది. జగన్ అయితే ఇపుడు తన పేరు చెప్పుకునే వైసీపీని పటిష్టం చేసుకునే దశలో ఉన్నారు. అందుకే కుమార్తె పక్షాన నిలబడిన విజయమ్మకు పదవులు అక్కరలేదు అని షర్మిల అంటున్నారు. ఇది వైఎస్సార్ అభిమానులకు బాధగా ఉన్న షర్మిల చెప్పినది కూడా ఒక విధంగా చూస్తే కరెక్టే.

ఆమె అధికారంలో ఉన్న వైసీపీకి గౌరవ అధ్యక్ష పదవిని వదులుకుని  ఏ రాజకీయ అంచనాలు లేని వైఎస్సార్టీపీలో పదవులు స్వీకరించినా దానికి  వన్నె చేకూరదు, అందుకే ఉదారంగా ఉడతాభక్తిగా కుమార్తె పార్టీకి వైఎస్సార్ భార్యగా సేవ చేయడమే ఆమెకు కూడా ఇష్టం కావచ్చేమో. మొత్తానికి ఒక్క మాట చెప్పాలంటే రెండు రాష్ట్రాలలో ఆమె బిడ్డల కంటే వారి ప్రస్తుత  రాజకీయ హోదాల కంటే కూడా వైఎస్సార్  సతీమణిగా విజయమ్మ హోదావే ఎక్కువ.  ఆమె అలా ఉంటేనే జనాలు ఎప్పటికీ గౌరవిస్తారు అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం.
Tags:    

Similar News