సోంపేట కాల్పులు : వైఎస్ హయాంలో పేలిన తూటా...అప్పుడే 12 ఏళ్లు

Update: 2022-07-14 15:30 GMT
బీల భూముల‌ను ప‌రిర‌క్షించుకుంటామ‌ని, ఇక్క‌డ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు వ‌ద్దేవ‌ద్ద‌ని చెప్పి ఉద్య‌మించిన రోజు మ‌రిచిపోలేం. ఇవాళ్టితో సోంపేట ఉద్య‌మానికి 12 ఏళ్లు. నాటి ఉద్యమాన్ని త‌ల్చుకుంటూ, నాటి వైఎస్సార్ హయాంలో జ‌రిగిన కాల్పుల‌ను త‌ల్చుకుంటూ, మ‌రోసారి ఇటువంటి ప‌ర్యావ‌ర‌ణ విఘాత చ‌ర్య‌లకు పాల్ప‌డితే ఒప్పుకునేదే లేద‌ని తేల్చిచెబుతున్నారు ఇక్క‌డి ఉద్య‌మకారులు. ఉద్య‌మాల గ‌డ్డ శ్రీ‌కాకుళంలో ఆ రోజు వైఎస్సార్ హ‌యాంలో వ‌ద్ద‌న్నా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఫైళ్లు క‌దిపారు.

అన్యాయంగా భూములు లాక్కొన్నారు. అటుపై భూముల‌లో ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసానికి పూనుకున్నారు.  ప‌చ్చ‌ని ప్ర‌కృతికి ఆనవాలుగా ఆనందాల‌కు ఆన‌వాలుగా నిలిచే నేల‌పై అత్యంత ప్ర‌మాద‌క‌ర థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్రాజెక్టు ఏ విధంగా పెడ‌తార‌ని, దీని వ‌ల్ల బీల‌లో ఎనిమిది వంద‌ల హెక్టార్ల‌లో ఉన్న భూమి (చిత్త‌డి నేల‌లు) నాశ‌నం అవుతాయ‌ని అప్ప‌టి వారంతా గొంతెత్తారు. బీల ప‌రిర‌క్ష‌ణ స‌మితి పేరిట న్యాయ‌పోరాటం చేశారు. మేథాపాట్క‌ర్ లాంటి ఉద్య‌మ‌కారులు ఇక్క‌డికి వ‌చ్చి, నిర‌స‌న దీక్ష‌ల‌కు మద్ద‌తుగా నిల్చారు.

సోంపేట, కంచిలి, క‌విటి మండలాల్లో ఉవ్వెత్తున సాగిన ఉద్య‌మం కార‌ణంగా వైఎస్సార్ స‌ర్కారు అనేక స‌మ‌స్య‌ల్లో ప‌డింది. అప్ప‌ట్లో ఇక్క‌డి రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వ‌త్తాసు ప‌ల‌క‌డంతో ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తింది. కొన్ని మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌పై కూడా నిర‌స‌న‌ల్లో భాగంగా రేగిన ఆందోళ‌న‌ల్లో దాడులు జ‌రిగేయి. పోలీసుల తూటాలు పేలాయి.

2010 జూలై 14  న వేల మంది పోలీసులు  త‌ర‌లి రాగా ఇక్క‌డ జ‌రిగిన కాల్పుల్లో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచారు. ఒక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. పోలీసు దెబ్బ‌ల‌కు తాళ‌ల‌కే ఆస్ప‌త్రి పాలైన ఆ నిర‌స‌నకారుడి గుండె ఆగిపోయింది. మృతుల్లో ప‌లాస‌పురానికి చెందిన గున్న జోగారావు, ల‌క్క‌వ‌రానికి చెందిన గొన‌ప కృష్ణ‌మూర్తి, బెందాళం కృష్ణ‌మూర్తి ఉన్నారు.

ఆఖ‌రి  వ‌ర‌కూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ రోజు ప‌ట్టు విడ‌వ‌లేదు. సోంపేట, కాక‌రాప‌ల్లి థ‌ర్మల్ పవ‌ర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి జ‌రిగిన ఉద్య‌మాలు  జిల్లా చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణాధ్యాయం అయి నిల్చాయి అని క‌మ్యూనిస్టులు వ్యాఖ్యానిస్తుంటారు. 2008లో ఆరంభం అయిన ఈ ఉద్యమం 2010 జూలై 14తో మ‌రింత ఉద్ధృత రూపం దాల్చింది. ఉగ్ర రూపం అందుకుంది.

సోంపేట కాల్పుల‌కు నేటితో ప‌న్నెండేళ్లు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వం థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి జీఓలు ర‌ద్దు చేయ‌డంతో ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది. బీల ప్రాంతంలో అమ‌రులు అయిన వారికి ఈ సంద‌ర్భంగా క‌మ్యూనిస్టులు నివాళులిస్తున్నారు.
Tags:    

Similar News