ఒక్క కేసు వస్తే చాలు..ఐపీఎల్ మొత్తం మటాష్

Update: 2020-08-07 00:30 GMT
సస్పెన్స్ వీడింది. క్లారిటీ వచ్చింది. కరోనా వేళ.. ఐపీఎల్ టోర్నీని దుబాయ్ లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు కొంతమేర పూర్తి అయ్యాయి కూడా. వైరస్ విరుచుకుపడుతున్న వేళ.. భారీ టోర్నీని ఎంత జాగ్రత్తగా నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఆటగాడి ఆరోగ్య భద్రత కోసం పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం మీద డేగకన్ను వేయటం.. తరచూ పరీక్షలు నిర్వహించటం తెలిసిందే.

ఆటగాళ్లు.. వారి సిబ్బందికి సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లు.. వారు ఉండాల్సిన బస..తీసుకునే ఆహారం.. ఇలా ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తలు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చేసిన వ్యాఖ్యలు హెచ్చరికలుగా మారాయి. టోర్నీ వేళ.. ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా.. మొత్తం ఐపీఎల్ నాశనం అవుతుందని పేర్కొన్నారు. అందుకే.. లీగ్ ను అత్యంత కఠినంగా నిర్వహించాలన్నారు.

గతంతో పోలిస్తే.. ఐపీఎల్ 2020 సూపర్ హిట్ అవుతుందన్నారు. టీవీల్లో అత్యధికంగా వీక్షించే టోర్నీగా రికార్డులు క్రియేట్ చేస్తుందన్న ఆయన.. బీసీసీఐ.. ఫ్రాంచైజీల సమావేశం ముగిశాక మాట్లాడారు. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవటంపై రియాక్టు అయ్యారు. తాము ఆ విషయం గురించి ఆలోచించటం లేదని.. లీగ్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నామన్నారు. తమ ఆందోళన అంతా జట్టు ఆటగాళ్లు.. సిబ్బంది గురించేనని చెప్పారు.

ఐపీఎల్ విజయవంతం కావాలని ఫ్రాంచైజీ యజమానులమంతా అనుకున్నట్లు చెప్పిన ఆయన.. బోర్డుకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పాన్సర్లు బేరాలు ఆడతారని.. కానీ ఈ టోర్నీని టీవీల్లో అత్యధికంగా వీక్షించకపోతే తాను తన పేరును మార్చుకుంటానని చెప్పారు. ఈ లీగ్ లో స్పాన్సర్లు భాగస్వామ్యం కాకుంటే.. వారు మూర్ఖంగా వ్యవహరించినట్లేనని.. తాను కానీ స్పాన్సర్ ని అయి ఉంటే ఎగిరి గంతేసేవాడినని చెప్పారు. స్పాన్సర్లు.. టీవీల్లో టోర్నీని చూసే వీక్షకులు లాంటివి వాటి కంటే కూడా.. టోర్నీని ఏ ధైర్యంతో నిర్వహిస్తున్నారో.. అదే రీతిలో ఎవరికి ఎలాంటివి జరగకుండా ముగిస్తే అదే పది వేలు. లేనిపక్షంలో.. బీసీసీఐ కానీ.. ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానులు ఎంత వేదన చెందినా ఉపయోగం ఉండదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News