డేట్ చెప్పలేరట కానీ ఆ సీన్ మాత్రం తెలంగాణలో పక్కానట

Update: 2022-12-03 04:09 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా సాగిపోతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాలు బ్రేకింగ్ న్యూస్ గా మారుతున్నాయి. డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ ఆరోడాను అరెస్టుచేసి.. రిమాండ్ కు తరలించిన సందర్భంలో సిద్ధం చేసిన రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు తొలిసారి బయటకు వచ్చింది.

ఈ రిపోర్టులో కవిత పేరు వచ్చిన రెండు రోజులకు సీబీఐ నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ కవిత సైతం ధ్రువీకరించారు. ఆరో తేదీన హైదరాబాద్ లోనే తన ఇంటికి సీబీఐ అధికారులు రావాలని కోరినట్లుగా ఆమె వెల్లడించారు. మరి.. తర్వాతేం జరుగుతుంది? కవిత అరెస్టు తప్పదా? అసలు అక్కడి వరకు విషయం వెళుతుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాన్ని అక్కడి వరకు తీసుకెళతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య నడుస్తున్న పోరు నేపథ్యంలో తనకు లభించిన అవకాశాన్ని మోడీషాలు అస్సలు వదులుకోరని చెబుతున్నారు. తమతో పెట్టుకున్న వారు ఎవరైనా సరే.. వారి స్థాయి ఏమైనా సరే.. లెక్కలు తేల్చాల్సిందే అన్నట్లుగా వారి మైండ్ సెట్ ఉంటుందని చెబుతారు. ఒకవేళ రాజీకి వస్తే అన్న మాటకు భిన్నమైన సమాదానం వినిపిస్తోంది.

తమతో లడాయికి దిగిన వారికి ఏదో ఒక నష్టం వాటిల్లేలాచేసి.. ఆ డ్యామేజ్ తర్వాతే మౌనంగా ఉండటం మోడీషాలకు అలవాటుగా చెబుతారు. గడిచిన కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని చెబుతాయమంటున్నారు. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత డ్యామేజ్ తమకు కేసీఆర్ కారణంగా జరిగినట్లుగా మోడీషాలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ కు సంబంధించి కేసీఆర్ అన్ని గీతలు దాటేశారని.. అలాంటప్పుడు ఇప్పుడు తాము వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా స్వయంగా టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తగ్గించలేనంత దూరం మోడీషాలకు కేసీఆర్ కు పెరిగిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక కీలక పరిణామం చోటు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

తాము అంచనా వేసినట్లుగానే కేంద్ర విచారణ సంస్థలు కవితను అరెస్టు చేస్తే.. వేధింపుల్లో భాగంగానే ఇదంతా జరిగిందన్న మాటతో పాటు.. భారీ ఎత్తున సానుభూతి వ్యక్తమయ్యేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపై గులాబీ దళం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. కవిత అరెస్టు తథ్యమైతే.. డేట్ ఎప్పుడు ఉంటుందన్న దానిపై ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కొత్త సంవత్సరం రాక ముందే.. అరెస్టు తప్పదన్న మాట కొందరు టీఆర్ఎస్ కు చెందిన మంత్రుల నోట వస్తోంది. మరి.. వీరి అంచనాలు ఎంతమేర నిజమవుతాయో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News