రైతుల పంతం గెలిచింది

Update: 2021-01-24 06:57 GMT
మొత్తానికి రైతుసంఘాల ఒత్తిడికి ఢిల్లీ పోలీసులు కూడా తలొంచాల్సి వచ్చింది. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డు+ఇన్నర్ రింగ్ రోడ్డులో 2 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు రైతుసంఘాలకు పోలీసులు అనుమతించారు. రైతుసంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్రప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ర్యాలీ విషయంలో చివరకు సుప్రింకోర్టు కూడా చేతులెత్తేసింది. ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాబట్టి పోలీసులే తేల్చుకోవాలని చెప్పేసింది.

ర్యాలీని సుప్రింకోర్టు అడ్డుకుంటుందన్న ఆశతో ఉన్న కేంద్రానికి పెద్ద దెబ్బ తగిలింది. దాంతో ఏమి చేయాలో తెలీక ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపింది కేంద్రం. చివరకు అనేకసార్లు చర్చల తర్వాత ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. తాము అనుమతి ఇవ్వకపోతే ర్యాలీని ఎలాగైనా చేసి తీరుతామని రైతుసంఘాల నేతలు ముందే పోలీసులకు చెప్పేశారు. దాంతో ర్యాలీని రెండు రకాలుగా విడదీశారు. మొదటిదేమో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో సాగుతుంది. ఇక రెండోదేమో ఢిల్లీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సాగుతుంది.

మొత్తం 60 కిలోమీటర్ల ర్యాలీలో 47 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డులోనే ఉంటుంది. ఇక మిగిలిన 13 కిలోమీటర్లు మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్డులో సాగుతుంది. ఇక్కడే పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డంటే ఢిల్లీలో నగరంలోకి ర్యాలీని అనుమతించినట్లే. దాంతో 2 లక్షల ట్రాక్టర్ల ర్యాలీ అంటే అదవ్వటానికి ఎన్నిగంటలు పడుతుందో పోలీసులు ఊహించలేకున్నారు.

దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు ర్యాలీని ఉపసంహరించుకోమని పోలీసులు కోరినా రైతుసంఘాలు కుదరదు పొమ్మన్నాయి. పోలీసుల అంచనా ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డులో ర్యాలీ పూర్తవ్వటానికి సుమారు 48 గంటలు పడుతుంది. అంటే రెండు రోజులు ఢిల్లీ దాదాపు అష్టదిగ్బంధనంలో ఉండిపోతుంది. దేశ రాజధాని ఓ ర్యాలీ కారణంగా రెండు రోజులు అష్టదిగ్బంధనంలో ఉండిపోవటం అంటే మామూలు విషయం కాదు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 2 నెలలుగా రైతుసంఘాలు చేస్తున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర వాయిదా వేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతులు అంగీకరించటం లేదు. ఇదే సమయంలో తమ ర్యాలీని జరిపితీరుతామని చెప్పారు. దానికి తగ్గట్లే ర్యాలీకి అనుమతిని సాధించుకున్నారు. మొత్తానికి చేసేదేమీ లేక ర్యాలీ రూటుమ్యాప్ కోసం పోలీసు ఉన్నతాధికారులు వెయిట్ చేస్తున్నారు. అంటే రైతుసంఘాల ఒత్తిడికి ఇటు కేంద్రం అటు ఢిల్లీ పోలీసులు కూడా లొంగిపోయారనే అనుకోవాలి.
Tags:    

Similar News