రాజస్థాన్ లో తొలి డెల్టా ప్లస్ కేసు..టీకా తీసుకోవడంతో సేఫ్

Update: 2021-06-27 02:30 GMT
రెండు డోసులు టీకా తీసుకున్న 65 ఏళ్ల మహిళకు తాజాగా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. రాజస్థాన్ లోని డెల్టా ప్లస్ మొదటి కేసు ఇదే. అయితే రెండు డోసులు తీసుకోవడంతో ఆ వృద్ధురాలి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఆమె చికిత్స పొందుతూ ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వైరస్ జాతి నమోదైన తొలి కేసుగా ఈ మహిళ రికార్డుకు ఎక్కింది. దేశంలో డెల్టా ప్లస్ సోకిన 9వ రాష్ట్రం రాజస్థాన్ కావడం గమనార్హం.

రాజస్థాన్ లోని బికినీర్ పీబీఎం ఆస్పత్రిలో ఈ డెల్టా ప్లస్ తొలి కేసుకు చికిత్స అందించారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన తొలి మహిళకు ఏం కాలేదని.. టీకాలు రెండు డోసులు తీసుకోవడం వల్ల ఆమెకు ప్రాణాపాయం లేదని తేలింది. ఇక బికనీర్ కలెక్టర్ కు ఈ డెల్టా ప్లస్ కేసుపై కేంద్రప్రభుత్వం నివేదిక పంపింది. వెంటనే అక్కడ కొత్త వైరస్ జాతి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

దీంతో బికనీర్ కలెక్టర్ అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళ నివాసం.. చుట్టుపక్కల వారికి ప్రత్యేక సూచనలు చేసి క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఈ ప్రాంతంలో అందరికీ కరోనా పరీక్షలు చేసి వారందరినీ క్వారంటైన్ లో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం డెల్టా ప్లస్ తొలి కేసుగా రాజస్థాన్ లో గుర్తించిన మహిళ కోవిడ్ నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. రాజస్థాన్ లో డెల్టా ప్లస్ రకం వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాపించకుండా రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని.. నిర్లక్ష్యం ప్రదర్శించరాదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.

ఇప్పటికే దేశంలో డెల్టా ప్లస్ రకం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా వెలుగుచూసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News