కర్చీఫ్ వేసేసిన మాజీ మంత్రి...?

Update: 2021-10-25 13:30 GMT
ఆయన అలాంటి ఇలాంటి నాయకుడు కాదు, ఉద్యోగార్ధం విశాఖ వచ్చి ఆ తరువాత పారిశ్రామికవేత్తగా అవతరించి ఆ మీదట విశాఖలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోనే ఇపుడు కీలకమైన నేతల్లో ఒకరుగా నిలిచారు. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన వచ్చే ఎన్నికల కోసం కర్చీఫ్ ని అపుడే పరచేశారు. ఆయన చేరే పార్టీ కూడా దాదాపుగా డిక్లేర్ అయినట్లే. ప్రతీ ఎన్నికలలోనూ నియోజకవర్గాన్ని, పార్టీని మార్చకపోతే ఆయనకు లక్ కలసి రాదు. పైగా అది పెద్ద‌ సెంటిమెంట్ గా కూడా మారింది. ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ మారలేదు. దాంతో ఆయన ఎమ్మెల్యేగా అతి కష్టం మీద గెలిచినా పార్టీ ఓడిపోయింది. దీంతో గంటా ఈసారి ఆ తప్పు చేయదలచుకోలేదుట. ఆయన ఈసారి చేరే పార్టీ కచ్చితంగా జనసేన అవుతుంది అంటున్నారు.

నాడు అంటే 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెడితే నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు దానికి గుడ్ బై కొట్టి మరీ ప్రజారాజ్యంలో చేరారు. ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఆయన కీలకంగా మారారు. తనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ముఖ్య నేతలలో ఒకరుగా మెలిగారు. ఆ తరువాత కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయితే మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల వేళ ఆయన టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఇక ఆయన 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరాలనుకున్నా కుదరలేదు. ఆయన శిష్యుడు అవంతి శ్రీనివాసరావు ముందే జంప్ చేసి మినిస్టర్ అయిపోయారు.

ఇక ఇపుడు గంటా చూపు జనసేన మీద ఉంది అంటున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే గంటా ఈ మధ్యన చిరంజీవి రాజమండ్రి వచ్చి అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఆయన వెన్నంటే ఉన్నారు. మరి ఆయన ఇపుడు తమ్ముడు పవన్ పార్టీలో కీలకం కాబోతున్నారు అన్న వార్తలు గట్టిగా ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ నెల 31న విశాఖ వస్తున్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు మద్దతు ఇస్తారు. అదే విధంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నిజానికి గంటా చాలా కాలం క్రితమే విశాఖ రావాలని పవన్ని బహిరంగంగానే కోరారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తే పవన్ని తాను మెచ్చుకుంటానని కూడా నాడు గట్టిగా చెప్పారు.

మొత్తానికి అంతా గంటా అనుకున్నట్లుగానే అవుతోంది. జనసేనకు విశాఖ మీద మోజు ఉంది. బలం, బలగం ఉంది. కానీ సరైన నాయకత్వం లేదు. దాంతో గంటా ఆ లోటు తీరుస్తారు అంటున్నారు. గంటాను 2019 ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ గట్టిగా విమర్శించారు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. ఒకరు అవసరం మరొకరికి బాగా ఉంది. పైగా గంటా పొలిటికల్ గా సీనియర్, సక్సెస్ ఫుల్ ప్లానర్ అని అంటారు. దాంతో నాడు అన్నకు చేసిన సాయం ఇపుడు తమ్ముడికి చేస్తారు అంటున్నారు.గంటా తలచుకుంటే మూడు జిల్లాలలో వివిధ పార్టీలలో ఉన్న బలమైన నేతలు జనసేనలోకి రావడం ఖాయం. మొత్తానికి ఉత్తరాంధ్రాలో జనసేన తన బలం చాటాలంటే గంటా లాంటి వారి చేరిక ఉపయోగపడుతుంది అంటున్నారు. మొత్తానికి గంటా ఫ్యూచర్ ప్లాన్ అన్నది రెడీ అయిపోయింది. గంటా తొందరలొనే తన యాక్షన్ ప్లాన్ తో బయటకు వస్తారు అంటున్నారు.




Tags:    

Similar News