ఆతిథ్య రంగం కుదేల్‌..ఊహించ‌ని రీతిలో 5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం!

Update: 2020-05-25 10:50 GMT
భార‌త‌దేశంలో ప్ర‌కృతి అందాల ర‌మ‌ణీయ ప్ర‌దేశాలు ఎన్నో. ఉప ఖండంగా ఉన్న భార‌త‌దేశంలో ఎన్నో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు - ప్రాంతాలు ఉన్నాయి. పెద్ద సంఖ్య‌లో విదేశీయుల‌తో పాటు వివిధ రాష్ట్రాల వారు భార‌త‌దేశంలోని సంద‌ర్శ‌నీయ స్థ‌లాల‌ను విశేషంగా సంద‌ర్శిస్తుంటారు. ఇన్‌ క్రెడిబుల్ ఇండియాగా ప‌ర్యాట‌క రంగాన్ని భావిస్తూ విస్తృతంగా ఈ రంగానికి చేయూత అందిస్తోంది. భార‌త‌దేశ జీడీపీలో ప‌ర్యాట‌క రంగం కూడా వాటా కూడా కొంత ఉంది. అయితే ఇప్పుడు ఆ రంగం కుదేలైంది. మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌ల రాక‌పోక‌లు ఆగిపోయాయి. దీంతో ప‌ర్యాట‌క‌ - సంద‌ర్శ‌నీయ స్థ‌లాలు క‌ళావిహీనంగా మారాయి. ఆ రంగాన్ని న‌మ్ముకుని ఉన్న ఇత‌ర వ్యాపారాలు కూడా భారీగా న‌ష్ట‌పోతున్నాయి. ముఖ్యంగా ప‌ర్యాట‌క రంగాన్ని న‌మ్ముకుని హోట‌ళ్లు - లాడ్జిలు - ర‌వాణా - గిఫ్ట్ దుకాణాలు - గైడ్స్ త‌దిత‌రులు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి ఉపాధి పోయింది. దీంతో దిన‌దిన గండంగా బ‌త‌కాల్సి వ‌స్తోంది.

ఈ లాక్‌ డౌన్‌ తో ప‌ర్యాట‌క రంగం ఏకంగా రూ.5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని అంచ‌నా. ఆ మహమ్మారితో ఆతిథ్య రంగానికి అపారనష్టం వ‌చ్చి ప‌డింది. దేశవ్యాప్తంగా హోటళ్లు - రవాణా రంగానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. వేసవి కాలంలో ప్ర‌జ‌లు ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. వేస‌వి సీజన్ వారికి పండ‌గ రోజులులాంటివి. ఇలాంటి స‌మ‌యంలోనే లాక్‌ డౌన్ ఉండడంతో తీవ్ర న‌ష్టం వ‌చ్చింది. ఈ రంగంలో సంఘటిత రంగానికి చెందిన సంస్థలు మూడో వంతు ఆదాయాన్ని కోల్పోయాయి. దేశంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ప‌ర్యాట‌కం ఒకటి. ఈ రంగంలో సుమారు 2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని అంచనా.

లాక్‌ డౌన్‌ తో కుదేలైన ప్ర‌ధాన రంగాల్లో ఆతిథ్య రంగం ఒక‌టి అని సీఐఐ తెలిపింది. ఊహించ‌ని స్థాయిలో న‌ష్ట‌పోయిన ఆతిథ్య రంగానికి ఎంఎస్‌ ఎంఈ ట్యాగ్‌ ఇవ్వాలని సీఐఐ కోరుతోంది. రూ.5 కోట్ల నుంచి రూ.75 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన సంస్థలకు ఇచ్చే ఎంఎస్‌ ఎంఈ ట్యాగ్‌ను రూ.250 కోట్ల లోపు టర్నోవర్‌ కలిగిన ఆతిథ్య సంస్థలకు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు రుణ వసూళ్ల‌ను నిలిపివేయాలని సూచించింది. ఈ రంగం కోలుకోవ‌డానికి చాలా రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News