మేల్కోకుంటే ప్ర‌మాదమే..ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రిస్తున్న నివేదిక‌

Update: 2020-04-11 08:34 GMT
ప్ర‌పంచంలో దాదాపు అన్ని దేశాలు వైద్యారోగ్యంతోపాటు విద్యారంగాన్ని విస్మరించి ఇత‌ర రంగాల‌కు ప్రాధాన్య‌మిస్తాయి. అందుకే ప్ర‌స్తుతం కరోనా వైరస్ నుంచి తమ ప్ర‌జ‌లను కాపాడుకోవ‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇన్నాళ్లు వైద్యారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం స‌త్వ‌ర‌మే క‌రోనా బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించ‌లేని ప‌రిస్థితి. ముఖ్యంగా వైద్యుల‌ - వైద్య సిబ్బంది కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. దీంతో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నాం. అగ్ర‌రాజ్యం అమెరికానే నానా అవ‌స్థ‌లు ప‌డుతోంది. ఆ దేశంతో పాటు మ‌రికొన్ని దేశాలు వైద్య సేవ‌ల కొర‌త‌తో క‌రోనా సోకిన వృద్ధుల‌ను ఆస్ప‌త్రిలో చేర్చుకోకుండా కేవ‌లం యువ‌త‌కు మాత్ర‌మే వైద్యం అందిస్తున్న ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

ఆస్ప‌త్రిలో వైద్యుడు రోగిని ప‌రిశీలించి ఏం సోకిందో.. ఏం చేయాలో? ఏ ప‌రీక్ష‌లో.. ఏ సూది - ఏ మందు ఇవ్వాలో చెబుతాడు. వాటిన్నిటిని చేయాల్సింది న‌ర్సు. వైద్యుడి త‌ర్వాత రోగిని ప‌ట్టించుకునేది న‌ర్సు. వైద్యుడి ప‌రిశీల‌న అనంత‌రం నిరంత‌రం న‌ర్సు ప‌ర్య‌వేక్షిస్తుంటారు. రోగి కోలుకునే వ‌ర‌కు న‌ర్సు సేవ‌లు ఎంతో అవ‌స‌రం. మ‌ద‌ర్ థెరిస్సా కూడా ఒక న‌ర్సే. ఆమె వైద్య సేవ‌లతో ప్ర‌పంచం మొత్తం హ‌ర్షించింది. మానవ‌త్వం - ప్రేమాప్యాయ‌ల‌తో వైద్య స‌హాయం చేసే వారే న‌ర్సులు. మ‌ద‌ర్ థెరిస్సా త‌ర్వాత అంత‌టి ఖ్యాతి, గుర్తింపు పొందిన న‌ర్స్ నైటింగేల్‌. అంత‌టి కీల‌కంగా ప‌ని చేసే న‌ర్సులు త‌క్కువ సంఖ్య‌లో ఉన్నారు. ప్ర‌పంచ‌దేశాల్లో న‌ర్సుల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. న‌ర్సుల సేవ‌లు చాలా త‌క్కువ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆపత్కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి గుర్తింపూ వస్తోంది.

ఈ క్ర‌మంలో వెలువ‌రించిన ‘ది స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ నర్సింగ్‌–2020’నివేదికను చూస్తే ప‌రిస్థితి ఎలా ఉందో చెబుతోంది. ప్రపంచంలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని - రానున్న పదేళ్లలో ఇది చాలా తీవ్రమవుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఆ నివేదిక ఉంది. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే  న‌ర్సుల‌ కొరత ఉండకూడ‌ద‌ని ఆ నివేదిక హెచ్చ‌రిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ ఓ,) ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ (ఐసీఎన్‌) - నర్సింగ్‌ నౌలు ఆ నివేదిక‌ను సంయుక్తంగా రూపొందించాయి. ప్రతి యేటా ప్రతి దేశంలో 8 శాతం మంది నర్సులు పెరగాల్సిన ప్రాధాన్యం వెల్ల‌డిస్తోంది.

ప్రపంచంలోని మొత్తం వైద్య సిబ్బందిలో సగానికి పైగా నర్సులే ఉన్నారని ఆ నివేదిక చెబుతోంది. అన్ని దేశాల్లో కలిపి పనిచేస్తున్న నర్సుల సంఖ్య‌ 2.8 కోట్ల మంది అని తెలిపింది. 2013-18 మధ్య కాలంలో ఈ వృత్తిలోకి వచ్చింది కేవలం 4.7 మిలియన్లేన‌ని పేర్కొంది. ప్రస్తుత జనాభాకు 59 లక్షల మంది నర్సుల కొరత ఉందని వెల్ల‌డించింది. ముఖ్యంగా ఆఫ్రికా - ఆగ్నేయాసియా - తూర్పు మధ్యధర దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉందని ఆ నివేదిక చెబుతోంది. ప్రపంచంలో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం మంది కొన్ని దేశాల్లో మాత్ర‌మే ఉన్నారని వివ‌రించింది.

ప్రతి 8 మంది నర్సుల్లో ఒకరు త‌మ సొంత దేశంలో కాకుండా ఇత‌ర దేశాల్లో సేవ‌లు అందిస్తున్నారంట‌. ప్రతి ఆరుగురిలో ఒక నర్సు పదేళ్లలో రిటైర‌వుతార‌ని - అంటే 17 శాతం మంది నర్సులు సేవ‌ల నుంచి దూరం కానున్నారు. నర్సుల సంఖ్యలో ప్రతియేటా 8 శాతం పెంచుకోవాలి. ప్రతి మనిషి తలసరి ఆదాయంలో 10 యూఎస్‌ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉందని ఆ నివేదిక‌ సూచిస్తోంది.

ఈ లెక్క‌న మన దేశంలో దాదాపు 750 రూపాయలు చెల్లించాల‌ని చెబుతోంది. నర్సుల్లో 90 శాతం మంది మహిళలే ఉన్నారని - పురుషులు త‌క్కువ సంఖ్య‌లో ఉన్నార‌ని వెల్ల‌డించింది. ప్రపంచంలోని దేశాల వారీ పరిస్థితులను - ఆయా దేశాల్లో నర్సింగ్‌ సౌకర్యాలు - తీసుకోవాల్సిన చర్యల గురించిన పూర్తి నివేదిక  మే నెల‌లో విడుదల చేయ‌నుంద‌ని స‌మాచారం. క‌రోనా వైర‌స్ వ్యాప్ఇ నేప‌థ్యంలో విడుద‌లైన ఈ నివేదిక ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించేలా ఉంది. వైద్యారోగ్య శాఖ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ప‌రోక్షంగా ఆ నివేదిక సూచిస్తోంది. మ‌రీ ఈ నివేదిక ఆధారంగా దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకుంటే భ‌విష్య‌త్‌ లో ఎలాంటి వ్యాధులు వ‌చ్చినా త‌ట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు క‌ళ్లు తెరిస్తే భ‌విష్య‌త్ ప్ర‌మాద‌క‌రంగా మార‌దు.
Tags:    

Similar News