వ్యాపారం కాదు ట్రంప్ పై వార్ చేస్తారట

Update: 2017-02-03 05:11 GMT
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. యాపిల్.. ఫేస్ బుక్.. ఉబెర్.. ఈ పేర్లు విన్న వెంటనే మీకేం గుర్తుకొస్తుంది? వారి వ్యాపారం.. వారి ఆదాయం.. వారు సృష్టించే ఆర్థిక వృద్ధి లాంటివి గుర్తుకొస్తాయి. అంతేకాదు.. ప్రపంచాన్ని ప్రభావితం చేయటంలో వారికి వారే సాటి. ఇంతకాలం వ్యాపారం మీద మాత్రమే ఫోకస్ చేసిన ఈ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడి మీద టెక్ వార్ కు సిద్ధమవుతున్నారు.

విధానాల పరంగా ఇబ్బందులు రానంత వరకూ ఫర్లేదు. కానీ.. ట్రంప్ కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అమెరికా మీదన.. దిగ్గజ కంపెనీల వ్యాపార ప్రయోజనాల మీద తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉండటంతో దిగ్గజ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. విశ్వవ్యాప్త ట్యాగ్ ఉన్న కంపెనీలకు సరిహద్దుల హద్దులు ఎంతటి ఇబ్బందన్న విషయం వీరికి తెలియంది కాదు. అందుకే.. ఈ తీరును తీవ్రంగా తప్పు పడుతూ తమదైన శైలిలో వార్ కు సిద్ధం అవుతున్నారు.

ఇందులో భాగంగా ప్రఖ్యాత కంపెనీలైన మైక్రోసాఫ్ట్.. యాపిల్.. గూగుల్.. ఫేస్ బుక్.. ఉబెర్ లాంటి కంపెనీలు ఇప్పుడు ఒకే తాటి మీదకు రావటమే కాదు.. ట్రంప్ కు ఒక లేఖాస్త్రాన్ని సంధిస్తున్నారు. దిగ్గజ కంపెనీలకు తోడుగా మరిన్ని టెక్ కంపెనీలు ఒక తాటి మీదకు రావాలని డిసైడ్ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసల్ని నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఈ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా పుట్టిన నాటి నుంచి అవకాశాల గడ్డగా వెలుగొందుతుందని.. కొత్తవారిని స్వాగతిస్తోందని.. అలాంటి వాటిని దెబ్బ తీసేలా ట్రంప్ ప్రభుత్వ పనితీరు ఉండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క ట్రంప్ నిర్ణయం వెనుకున్న ఆలోచనను గౌరవిస్తాం కానీ.. జారీ చేసిన ఆర్డినెన్స్ పై తమకున్నఅభ్యంతరాల్ని కుండబద్ధలు కొట్టేయటం గమనార్హం.

అమెరికా ఆర్థిక వ్యవస్థను పురోగమించాలన్న మీ సంకల్పంతో తమ వ్యాపార వర్గాలు సైతం చేతులు కలుపుతాయని.. వేలాది మంది అమెరికన్లతో పాటు నైపుణ్యం కలిగిన విదేశీయులను కూడా నియమించుకుంటామని.. ఈ నేపథ్యంలో తీసుకునే నిర్ణయాలు అమెరికాకు లాభం చేకూరేలా ఉండాలన్న వాదనను వినిపించారు. మరి.. ఇలాంటి మాటల్ని మొండి ఘటం ట్రంప్ వింటారా? వ్యాపారాలు చేసే వారు.. వ్యాపారాలు చేసుకోకుండా సలహాలు ఇస్తారా? అని ట్రంప్ ఫైర్ అవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News